Friday, August 24, 2018

ఆలోచనలు

ఆలోచనలు
 
నిషి మనసులో నిత్యం ఆలోచనలు ఊరుతుంటాయి. అవి సవ్యమైనవైతే పురోగతికి, అప సవ్యమైతే అధోగతికి దారితీస్తాయి. మనం తేరుకున్న నీటినే తాగుతాం. ఏరుకున్న కూరగాయల్నే తింటాం. జీవిత గమనంలో మేలైన వాటినే ఎంచుకుంటాం అన్నది సారాంశం. మస్తిష్కంలోని ఆలోచనల్ని ఎప్పటికప్పుడు వడపోత పోస్తుండాలి. అది నిరంతర అభ్యాసంతోనే అలవడుతుంది. ఆలోచనావిధానంలో ఎంతటి పరిపక్వత సాధిస్తే, జీవితం అంతటి ప్రయోజకత్వాన్ని సిద్ధించుకుంటుంది.
అడవిలో తూనీగలా తిరుగుతూ సతత హరితాల్ని, రంగురంగుల సువాసనలీనే పూలను, సంపూర్ణంగా విరిసిన కమలాలతో ఉన్న చెరువులను, జలజలా పారే సెలయేళ్లను, జంతుజాలాన్ని కళ్లింతలు చేసుకుని చూస్తూ అచ్చెరువొందుతున్న శూర్పణఖ కళ్లకు నార బట్టలతో, జటామండలంతో చెట్టుకింద కూచున్న రామయ్య కనపడ్డాడు. అప్పటిదాకా ప్రకృతి ధ్యాసలో, సవ్యదిశలో సాగుతున్న ఆమె ఆలోచనలు ఒక్కసారిగా పక్కదారి పట్టాయి. రుషిలా ఉన్న రాముడు మన్మథుడిలా కనిపించాడు. తనను పెళ్లిచేసుకొమ్మని అర్థించింది, బెదిరించింది. తాను ఏకపత్నీవ్రతుణ్నని, పెళ్లాడటం కుదరదని నచ్చజెప్ప ప్రయత్నించాడు రాముడు. వినకుండా మొండికేసింది. ఫలితంగా ముక్కూచెవులూ కోల్పోయింది. ఏడుస్తూ వెళ్లి విషయం అన్న రావణుడికి చెప్పింది.
రావణుడు ఎలాంటివాడు- నిష్ఠాగరిష్ఠుడు. శివుని మెప్పించినవాడు. చెల్లెలి మాటలు వినగానే అంతటి రావణబ్రహ్మ- ఆలోచనలు మందగించి, కోపంతో బుసలు కొడుతూ... అరణ్యంలో ఒంటరిగా ఉన్న అమ్మవారిని అపహరించాడు. భార్యతో సహా ఎంతమంది అది అధర్మమని చెప్పినా, ఆలోచనలను సవ్యమైన దిశలోకి మరల్చుకోలేకపోయాడు. చివరికి రాజ్యాన్ని, తనవాళ్లను, సమస్తాన్ని కోల్పోయాడు. ఆలోచనలెప్పుడూ నిర్మలంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అదుపు తప్పకూడదు.
ఆలోచనల్లో అనుమానపు బీజం పడితే, అతి తక్కువ సమయంలోనే అది మొలకెత్తి వటవృక్షమవుతుంది. రామరాజ్యంలో ఒక పౌరుడు అన్నమాటకు అంతటి ఉత్తమోత్తమ రాముడూ- అతడి మాట తనకు, రాజ్యానికి కళంకం అవుతుందేమో అన్న సంశయంతో ఆలోచనల్లో స్థిరత్వం కోల్పోయి ప్రాణానికి ప్రాణమైన సీతమ్మను అడవికి పంపి ఎంతో కుమిలిపోయాడు.
దేవకికి పుట్టబోయే అష్టమ సంతానం తనను చంపబోతోందని ఆకాశవాణి ద్వారా తెలిసి చెల్లెల్ని, బావను ఖైదు చేశాడు కంసుడు. పుట్టిన ఏ ఒక్క శిశువునూ వదలకుండా, పుట్టిన వెంటనే హతమార్చాడు. విధిని తప్పించుకోగలిగాడా, లేదు. మేనల్లుడు శ్రీకృష్ణుడి చేతిలో హతమయ్యాడు. చెల్లెల్ని హింసించిన అన్నగా చరిత్రలో అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. వక్రమార్గం పట్టిన ఆలోచనలకు సంపూర్ణ రూపం కౌరవులు. వారి అకృత్యాలను అక్షరబద్ధం చేసిన గ్రంథరాజమే మహాభారతం. కౌరవుల కుటిలత్వమే పాండవులను జనం దృష్టిలో ఉత్తములను చేసింది. ఉన్నతులుగా నిలబెట్టింది.
కుదురుగా సాగని ఆలోచనలు మనసును చంచలం చేస్తాయి. పదవిలో ఉన్నా, ఎవరివల్ల, ఎప్పుడు తన పదవికి ముప్పువాటిల్లుతుందో అన్న బెంగ ఇంద్రుడిది. ఎవరైనా కఠోర తపస్సు చేస్తే, తన పదవి, భోగభాగ్యాలన్నీ చేజారతాయని అనుక్షణం చింతాగ్రస్తుడై ఉంటాడు. స్వర్గంలోని ఆనందాన్ని తృప్తిగా అనుభవించలేని దౌర్భాగ్యం ఇంద్రుడిది.
ఆలోచనలన్నీ సత్యం మీద కేంద్రీకరించాడు కాబట్టే హరిశ్చంద్రుడు సత్యవాదిగా నిలిచాడు. స్వాతంత్య్రాన్ని సముపార్జించడంలో అందరూ మారణహోమం దిశగా అడుగులేస్తుంటే, అహింసాత్మక ఆలోచనలతో దాన్ని సాధించి, విదేశీయుల మనసులూ కొల్లగొట్టాడు కొల్లాయిగట్టిన గాంధీ. స్వచ్ఛమైన ఆలోచనలతోనే మనిషి ఆదర్శప్రాయుడవుతాడు. సమాజంలో చెక్కుచెదరని దేదీప్యమాన జ్యోతిగా వెలుగొందుతాడు!
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు