Thursday, June 30, 2016

97 శుద్ధ జలం

97                                                                          శుద్ధ జలం

ల్లాహ్‌ సృష్టిలోని అణువణువూ మానవులకు ఉపకరించేదే. భూమ్యాకాశాలు, లోయలు, పర్వత సానువులు, నదులు, సముద్రాలు, ఫలపుష్పాదులు, సజీవ నిర్జీవాలు...అన్నీ అత్యుత్తమ మనుగడ కోసమే. శుద్ధజలం మానవజాతి స్వచ్ఛతకు, ప్రాణరక్షణకు అత్యంత అవసరమైనది.‘నీరు పరిశుభ్రమైనది...ఏ వస్తువూ దాన్ని అపరిశుభ్రం చేయజాలదు.రెండు తొట్టెల కన్నా ఎక్కువగా ఉన్న నీటిలో మాలిన్యం పడినంత మాత్రాన అపరిశుద్ధం అయిపోదు...ఒకవేళ ఆ నీటి రంగు, రుచి, వాసన మారిపోతే తప్ప’ అని మహా ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ) అన్నారు.
‘మేము ఆకాశం నుంచి పరిశుద్ధ జలాన్ని అవతరింపజేశాము’ (ఖురాన్‌ 25:48) అని అల్లాహ్‌ తెలిపారు. ఇస్లాం ధర్మ నియమావళి ప్రకారం, ప్రతి నమాజుకు ముందు ఉజూ చేయాలి. ఉజూ కోసం నీరు కావాలి. ఉజూ చేసేటప్పుడు అవసరానికి మించి నీరు వాడరాదు. శరీర అవయవాలు అన్నింటినీ నీటితో కడిగేందుకు వీలులేనప్పుడు తడి చేత్తో తుడిచేందుకు ఇస్లాం అనుమతిస్తోంది.
మానవ జీవితంతో మమేకమైన నీటి వాడక ప్రాశస్త్యాన్ని పవిత్ర ఖురాన్‌ గ్రంథం తెలియజెబుతోంది. వర్షం కోసం చేసే ప్రత్యేక నమాజు ఇస్తిస్ఖా నమాజు. పండుగ నమాజులాగా దీన్ని సామూహికంగా ఈద్గాహ్‌లో ‘రెండు రకాతులు’ చేయాలి. ‘యా అల్లాహ్‌... దాహాన్ని తీర్చేది,ప్రయోజనకరమైనది, ఆలస్యం కాకుండాధరిత్రికిధారాపాతంగా చేరేదీ అయిన వర్షం కురిపించి దాహార్తిని తీర్చు. నీ దాసులకు, నోరులేని నీ జంతువులకు నీళ్ళు తాగించు. నీ కారుణ్య వర్షాన్ని అందరిపై కురిపించు’ అని అల్లాహ్‌ను ప్రార్థిస్తారు.
మహా ప్రవక్త ప్రబోధించిన విధంగా అల్లాహ్‌ మూడు రకాల మనుషుల్ని కరుణించడు. మొదటివారు తమ వర్తకపు సరకు గురించి అసత్య ప్రమాణం చేసేవారు, రెండోవారు తోటి మానవుల ధనంపై ఆశ కలిగినవారు. మూడోవారు ‘తమ అవసరానికి మించి నీటిని నిలుపుకొనేవారు’. దైవ సందేశహరులు (స.అ.వ) సహచరుల్ని ఉద్దేశించి ఇలా ప్రబోధించారు. ‘ప్రళయదినాన నేను కౌసర్‌ కోనేటి వద్దకు మీకంటే ముందే చేరి, మీకు ఎదురువచ్చి స్వాగతం పలుకుతాను. మీ దాహం తీర్చే ఏర్పాటుచేస్తాను. నా వద్దకు చేరగలిగిన ప్రతి వ్యక్తీ ఆ కోనేటి నీరు తాగుతాడు. మరెప్పుడూ అతడికి దాహం వేయదు. ధార్మిక విషయాల్లో ధర్మవిరుద్ధ విషయాలను మిశ్రమం చేసిన వారు ఇటు చేరలేరు, శాశ్వతంగా దాహార్తిని తీర్చుకోనూ లేరు’. నైతిక ధర్మాచరణకు, దాహార్తికి గల సంబంధం అసమానమైనది.
జకాత్‌ దానం కూడా నీటితో ముడివడి ఉంది. ఏ భూములైతే వర్షపునీరు లేక, సెలయేటి నీరూ లేక సాగుబడి అవుతాయో వాటి పంటలో పదో వంతును; ఏ భూములైతే నీటిపారుదల సమృద్ధిగా ఉండి సాగు అవుతాయో వాటి పంటలో ఇరవయ్యో వంతును జకాత్‌ దానంగా చెల్లించాలని ప్రవక్త (స.అ.వ) ఆదేశించారు. ఇది వ్యవసాయం చేసేవారి విధి. నీటి దానం గురించి ప్రవక్త (స.అ.వ.) ప్రస్తావించారు. ‘దారినపోయే ఒక వ్యక్తికి బాగా దాహం వేసింది. అటూ ఇటూ వెతికాడు. ఒక బావి కనిపించింది. అందులో దిగి నీళ్ళు తాగాడు. వెలుపలికి వచ్చిన తరవాత, ఒక కుక్కపిల్ల దప్పిక వల్ల నాలుక చాచి తడి మన్నును తినడం గమనించాడు. దాని దురవస్థకు జాలిపడి బావిలోకి దిగాడు. తన చర్మపు మేజోడులో నీళ్ళు నింపి, నోటితో పట్టుకొని వెలుపలికి వచ్చి, కుక్కపిల్లకు ఆ నీరు తాగించాడు. అల్లాహ్‌ ఆ వ్యక్తి చేసిన పనికి ప్రసన్నుడయ్యారు.కనుక ఏ ప్రాణిపట్ల దయచూపి దాహార్తి తీర్చినా పుణ్యం కలుగుతుంది’.
జీవనావసరమైన నీటిని, కూర్చొని రెండు లేక మూడు గుక్కల్లో తాగాలి. జమ్‌ జమ్‌ పవిత్ర జలాన్ని మాత్రం నిలబడి కాబా గృహం వైపు తిరిగి దుఆ చేసుకొని తాగాలి.
నీటిని పవిత్రంగా, అల్లాహ్‌ కరుణగా భావించాలి. ఉపవాస దీక్ష విరమణ చేసే విశ్వాసులందరూ దాహం తీర్చుకొని అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలి. చక్కటి వర్షాల కోసం, పవిత్ర రమదాన్‌ మాసంలో అందరం ప్రార్థిద్దాం!
- షేక్‌ బషీరున్నీసా బేగం

52 అమృత పుత్రులు

అమృత పుత్రులు
గవంతుడి పట్ల భక్తుడు పెంపొందించుకొనే ప్రేమ- వేదవిహిత కర్మలకన్నా, యోగసాధనకన్నా, జ్ఞానంకన్నా అత్యున్నతమైనది. అటువంటి భక్తి ఉదయించినప్పుడు, దానితో కోరికలు తీర్చుకోవడం తప్పు. అన్ని కోరికలూ దాటిన తరవాతే నిజమైన భగవద్భక్తి ప్రభవిస్తుంది. ఆ భక్తి భగవంతుడి నుంచి తిరిగి ఏమీ కోరదు.
మనిషి ప్రేమించినప్పుడు, ఆ ప్రేమలో అనేక వాంఛలు ఉంటాయి. దివ్య ప్రేమ అనే సూర్యుడు మనో దిక్‌మండలంపై ప్రకాశించగానే, అన్ని పనుల భారాన్నీ భగవంతుడికే వదిలివేయాలి. అటువంటి ప్రేమ సాధించడం కష్టమే!
ప్రేమ మూడు రకాలుగా ఉంటుంది. తాను ఏమీ ఇవ్వకుండానే, ఎదుటి నుంచి కోరుతుండేది ఒక రకం. రెండోది- ‘నేను ప్రేమిస్తాను. దానికి బదులుగా నాకు ఏదైనా ఇవ్వు’ అనేది. అది వస్తుమారక పద్ధతి లాంటిది. మూడో రకమైన ప్రేమ, తిరిగి దేన్నీ ఆశించదు. ఆ ప్రేమలోనే భక్తులు లీనం కావాలి. ప్రేమే సర్వస్వంగా, అదే వారి తుది గమ్యంగా సాగాలి.
ఆ ప్రేమలో ఆత్మ ఒక కాంతిధారలా భగవంతుడి వైపు ప్రవహిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ధనమో పేరుప్రఖ్యాతులో కావాలని కోరుకునేంత వ్యవధి ఉండదు. భగవంతుడు తప్ప, భక్తుడిలో వేరే ఆలోచనే కలగదు. ఆ ప్రేమభరిత స్థితిలో అతడిలో ఓ అనంతమైన, అద్భుతమైన ఆనందం ఉద్భవిస్తుంది. నిరంతరమూ ప్రవహించే ప్రేమామృత ధార అది!
అన్నింటికంటే ప్రేమను తేలికగా పొందవచ్చు. దానికి తర్కంతో పని లేదు. ఎవరూ ఎటువంటి ప్రదర్శనా ఇవ్వనక్కర్లేదు. రుజువులు చూపించాల్సిన పని అసలే ఉండదు.
హేతువు వల్ల, మన బుద్ధి ప్రతిదాన్నీ పరిమితం చేస్తుంది. అప్పుడు మనం ఒక వల విసురుతాం. అందినదాన్ని పట్టుకుంటాం. అది అందరికీ కనిపిస్తుంది. భగవంతుడి ప్రేమ అంత సులువుగా దొరికేది కాదు. ఆ ప్రేమ- కాలానికి అతీతమైంది. అది నిరపేక్ష మాధుర్యం!
ఒక హంతకుడు తన పిల్లవాణ్ని ముద్దాడినప్పుడు, ఆ ఒక్కక్షణం అతడిలో ప్రేమే కనిపిస్తుంది. మిగతా అన్నింటినీ విస్మరిస్తాడు. అదీ ప్రేమ గొప్పతనం!
స్వార్థచింతన, అహంకారం, కోపతాపాలు, కామవికారాలు- అన్నింటినీ భగవదగ్నిలో సమిధల్ని చేయాలి. వాటిని అలా దగ్ధం చేస్తే, మిగిలేది ప్రేమే!
‘సృష్టి సమస్తం దైవమయమే! ఆ దైవం పులి రూపంలో ఉంటే, భక్తుడు విడనాడటం మంచిది. జలాల్లోనూ భగవంతుడున్నాడు. అలా అని భక్తుడు కాలుష్య జలం బారిన పడకూడదు’ అని శ్రీరామకృష్ణ పరమహంస హితవు పలికేవారు.
భగవంతుడికి తమను తాము అర్పణ చేసుకొన్న భక్తులు, ప్రపంచం కోసం మరింత ఎక్కువ కృషిచేస్తారు. వారంతా భగవంతుడి పట్ల భక్తిజ్వాలలో పునీతులైనవారు. వారు పాటించే పరిశుభ్రత, ఆచరించే నిశ్శబ్దం నుంచి దైవశక్తి సంబంధిత వాక్కు లభిస్తుంది. అలాంటి మహాభక్తుల సాన్నిధ్యం దొరకడం ఎవరికైనా చాలా కష్టం! భక్తితత్పరుల సమక్షంలో కొన్ని నిమిషాలు గడిపినా చాలు- జీవితమంతా పూర్తిగా మారిపోతుంది.
భగవంతుణ్ని ప్రేమించేవారి సన్నిధి, లేదా వారు ఉండే చోటు ఓ పవిత్ర మందిరంగా మారుతుంది. ఆ భక్తులూ భగవత్‌ స్వరూపులే! వారి పలుకులు వేదాల వంటివి. పరమభక్తుల మాటల మాధుర్యం వల్లనే, ఆ ప్రాంతం మరో బృందావనంగా శోభిల్లుతుంది. ఆ భక్తులు దైవశక్తి అనే దివ్యకాంతిలో మెరిసేవారు. ఆ దైవానికి వారే అమృతపుత్రులు!
- కె.యజ్ఞన్న

54 జీవిత పరమార్థం

జీవిత పరమార్థం

జీవితం గీత గీసినట్లుగా తిన్నగా సాగదు. అది మిట్టపల్లాలతో నిండి ఉంటుంది. ద్వంద్వాలతో కూడి ఉంటుంది. విరుద్ధమైన భావాల జోడీని ‘ద్వంద్వం’ అంటారు.
సుఖదుఃఖాలు, రాత్రింబవళ్లు, ఉదయాస్తమానాలు, శీతోష్ణాలు, చీకటి వెలుగులు, ఎండ-వానలు, శరీరం-ఆత్మలు, ధర్మాధర్మాలు, జనన మరణాలు, స్త్రీలు-పురుషులు అనే పడుగుపేకలతో కాలాత్ముడు ప్రకృతి వస్త్రాన్ని నేస్తాడు. ఈ ప్రకృతిలో చేతనాలు, అచేతనాలు (జీవులు, నిర్జీవులు) అనే ద్వంద్వాలు నిండి ఉన్నప్పుడు, ప్రకృతిలో భాగమైన మానవుడి జీవితంలో ద్వంద్వాలుండటం అసహజం కాదు.
జీవితంలో ద్వంద్వాలుండాలి. ఈ ద్వంద్వాలే మానవుణ్ని ఉత్తేజపరుస్తాయి. అతడికి ఆనందం అందిస్తుంటాయి. జీవితంలో ముందుకు సాగడానికి సహకరిస్తుంటాయి. కష్టాల నుంచి బయటపడినప్పుడే మానవుడు సుఖాన్ని అనుభవించగలడు. కష్టం ఎదురైందని ముందుకు వెళ్ళడం మానేస్తే, ఆ దరిమిలా వచ్చే సుఖాన్ని మానవుడు పొందలేడు. కష్టం తరవాతనే దాని జోడీ అయిన సుఖం వస్తుంది. చేదును రుచి చూశాకనే, తీపివస్తువులోని మాధుర్యం అనుభవానికి వస్తుంది. విరహం లేనిదే అనురాగంలోని అనిర్వచనీయ రుచి అర్థం కాదు. రాత్రి గడవనిదే, వెలుగు నిండిన పగలు రాదు. ద్వంద్వాలను అర్థం చేసుకొని, జీవితంలో ముందుకు సాగే ప్రయత్నమే మానవధర్మం అనిపించుకొంటుంది!
మానవ జీవితంలో శరీరం, బుద్ధి, మనసు అనే ముఖ్యమైన మూడు ఒకదానితో ఒకటి సంగమించాలని పెద్దలంటారు. ఈ మూడూ విడివడని లంకె వంటివి. వీటిని విడదీస్తే జీవితం లేదు. మూడింటి నుంచి బుద్ధిని విడదీస్తే, ఆ వ్యక్తిని మూర్ఖుడంటారు. మనసును పక్కన పెడితే, మనసు లేని ఆ వ్యక్తిని మానవత్వం లేని మొరటువాడని, కఠినాత్ముడని అంటారు. శరీరం లేనిదే జీవితం ఉండదు. అందుకే మానవుడు తన శరీరాన్ని కాపాడుకోవాలి.
అరిషడ్వర్గాల మీద విజయం సాధించడం మానవుడికి ఎంతో అవసరం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరుగురూ అంతశ్శత్రువులు. వీళ్ళు బయటికి కనిపించరు. లోపలే ఉండి మనిషిని దెబ్బతీస్తుంటారు. వీళ్లను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మానవ జీవితం సుగమంగా ముందుకు సాగిపోతుంది.
కష్టాల్లో, ఆపదల్లో ఉన్న ప్రాణుల్ని చూసి వాళ్ల స్థానంలో మనమే ఉన్నట్లు భావించాలి. అప్పుడే అంతశ్శత్రువులు అంతరిస్తారన్నది, అనుభవ సారాన్ని ఇముడ్చుకొన్న పెద్దలు చెప్పే విలువైన మాట.
గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే, మానవులు సమాజ ధర్మాన్నీ పాటించాలి. తమ సంతానం, తమ తల్లిదండ్రులు, తమ బంధుజనులు- కేవలం వీళ్ల శ్రేయస్సుకు పాటుపడటమే పరమావధి కాకుండా, ఇరుగుపొరుగుల బాగోగుల్నీ చూస్తుండాలి. తామరాకుపై నీటిబొట్టులా వ్యవహరించాలి. తన సంపాదనలో కొంత భాగాన్ని ఇతరుల కోసం కూడా వెచ్చిస్తుండాలి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, భగవంతుణ్ని సేవించాలి. గృహస్థ జీవితంలో అనురాగ వాత్సల్యాలతో పాటు భక్తి, సేవ, త్యాగం ఉన్నందువల్ల- ఆ జీవితాన్ని పెద్దలు తపస్సుతో పోల్చారు.
రుషులు, మునులు లోకకల్యాణం కాంక్షించి తపస్సు చేశారు. ఫలితంగా వారు దైవానికి దగ్గరయ్యారు. సామాన్య గృహస్థులు సైతం సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ సేవలు సాగిస్తే, వారికీ సత్ఫలితమే లభిస్తుందని పెద్దలంటారు. ఇంతకు మించిన పరమార్థం మానవ జీవితానికి మరొకటి ఉండదు!
- కాలిపు వీరభద్రుడు

Wednesday, June 29, 2016

దుఆ (ప్రార్థన)

83                                                                           దుఆ (ప్రార్థన)
నిషి ప్రకృతిని ఆసరాగా చేసుకొంటాడు. భౌతిక అవసరాలు తీర్చుకుంటూ పెరిగేందుకు, బలంగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తాడు. నిజానికి, జీవన ఒడుదొడుకులు తట్టుకొనేందుకు, మనోవైకల్యాలు అధిగమించి సంపూర్ణ పరమార్థాన్ని సాధించేందుకు- ప్రతి నిమిషమూ ఆ సృష్టికర్తను ఆరాధించాలి. దుఆ చేస్తూ తనను తాను జ్ఞానిగా మలచుకోవాలి. ‘పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో దుఆ చేయండి. ఏమరుపాటుకు లోనై పరధ్యానంలో ఉంటూ చేసేవారి దుఆను అల్లాహ్‌ ఆమోదించడని తెలుసుకోండి. వినయ వినమ్రతలతో అమితమైన అణకువతో అల్లాహ్‌ను వేడుకోండి విలపిస్తూనూ...గోప్యంగానూ...’(ఖురాన్‌ 7:55)
ప్రార్థించే వ్యక్తి- పరిశుద్ధత పాటించాలి. కాబా గృహానికి అభిముఖంగా మోకాళ్ల వరకు ముడుచుకొని కూర్చొని, చేతులు భుజాల వరకు పైకెత్తాలి. ముందుగా తనకోసం, తరవాత తల్లిదండ్రుల కోసం, సోదరీ సోదరుల కోసం, యావత్తు సమాజం కోసం దుఆ చేయాలి. రాత్రి చివరి జాములో దైవకారుణ్యం మానవులపై ఉంటుంది. ప్రార్థించేందుకు అది చాలా మంచి సమయం. శుక్రవారం ఏ ఘడియలోనైనా దుఆ చేయవచ్చు. రమజాన్‌ మాసంలోని ఘనమైన రేయి లైలతుల్‌ ఖద్ర్‌లో చేసే దుఆ, ఖురాన్‌ పారాయణం తరవాత చేసే దుఆ, వర్షం కురిసేటప్పుడు చేసే దుఆలు సమ్మతమేనని దివ్య ఖురాన్‌ గ్రంథం తెలుపుతోంది.
తమ సంతానం కోసం తల్లిదండ్రులు చేసే దుఆ; బాధితులు, ప్రయాణికులు, విధేయులైన సంతానం చేసే దుఆ; ప్రజల కోసం న్యాయపరిపాలన చేసే రాజు దుఆ ఆమోదనీయమైనవి. అక్రమార్జనపరులు పవిత్ర మక్కాలోని కాబా గృహం వద్దకు చేరి ప్రార్థించినా అది అంగీకార యోగ్యం కాదు. నమ్మక ద్రోహిని, నిత్య పాపిని అల్లాహ్‌ ప్రేమించడు.
‘అల్లాహ్‌! దిగులు, దుఃఖం, బలహీనత, సోమరితనం, పిరికితనం, పిసినారితనం, రుణభారం, ఇతరులపై ఆధిక్యతా ప్రయత్నం నుంచి నేను నీ శరణు వేడుతున్నాను. నీవు నాకు చేసిన ఉపకారాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నీ దాసుడిని’ అని చేసే దుఆతో మానవుడి మనోవికారాలు అంతమొంది, సన్మార్గపు ద్వారాలు తెరుచుకుంటాయి.
‘ప్రభూ! నాకు దైవభీతిని, సచ్ఛీలతను, నిరాపేక్ష భావాన్ని ప్రసాదించాలని నిన్ను అర్థిస్తున్నాను. మా లెక్కలు తీసుకొనే రోజున- నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులందరినీ క్షమించు. పొరపాటున జరిగే మా తప్పులను ఎంచకు. మమ్మల్ని రక్షించు, కరుణించు. నీవు కనికరించేవాడివి. కరుణామయుడివి. నీ కృప వల్ల మేము జీవించి ఉన్నాం. నీ ఆదేశం మేరకు మరణిస్తాం. మేము నీ వైపే తిరిగిరావాల్సిన వాళ్లం’ అంటూ నిత్యం అల్లాహ్‌ ముందు ప్రార్థించినవారు రక్షణ పొందుతారు. అల్లాహ్‌ ప్రసాదిస్తే తప్ప శక్తి సామర్థ్యాలు మానవులకెక్కడివి? సర్వమూ ఎరిగినవాడు ఆ జగద్రక్షకుడు!
రమదాన్‌ మాసం విశ్వాసికి శిక్షణ వ్యవధి వంటిది. రానున్న పదకొండు నెలల్లో పైశాచికమైన షైతాన్‌ దుష్టప్రేరణలతో తలపడటానికి, ఇది శక్తిని సమీకరించుకొనే కాలం. విశ్వాసులు రమజాన్‌ చివరి పది రోజులు, రాత్రులు జాగరణ చేసి అధికోత్సాహంతో దైవారాధనలో నిమగ్నమవుతారు. ఇహ పర లోకాల్లో వరాలు కోరుతూ చేసే దుఆలతో మనుషుల మస్తిష్కం నుంచి పశుప్రవృత్తి, గర్వం, అహంకార భావాలు దూరమవుతాయి. ‘దుఆ విషయంలో విరక్తి చెందకండి. ఏమరుపాటుకు లోను కాకండి. దుఆ చేసేవాడు ఎన్నటికీ నాశనం కాడు’ అని ప్రియమైన ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ.) ప్రబోధించారు.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ మన అత్యంత శ్రేష్ఠమైన రమదాన్‌ ఆరాధనలను, దుఆలను అంగీకరించి విశ్వశాంతి కలిగించుగాక. ఆమీన్‌.
- షేక్‌ బషీరున్నీసా బేగం

నాన్నకు జేజేలు

నాన్నకు జేజేలు!
85
‘దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది. ‘పురుషే హవా అయిమదితో గర్భో...’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు స్త్రీయందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది. తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం.
తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది. ‘పుత్ర శబ్దానికి- తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.
‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి. దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు. అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడు... అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు... అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు... ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు. అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.
అమ్మను ఇంట్లో ఉంచుకుందాం దేనికైనా ‘పని’కొస్తుందని, అమ్మానాన్నలను విడదీసేవారికి ‘తల్లిదండ్రులు’ అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం. ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ, స్వభావరీత్యా ఏకవచనమే! కాబట్టే విగ్రహవాక్యం- ‘తల్లియును తండ్రియును’ అంటూ ఏకవచనంలో చెప్పాలంది వ్యాకరణ శాస్త్రం. ‘వారు ఇద్దరు కారు, ఒక్కరే’ అనే భావనను మనలో పెంపొందించడానికే- భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది.
కుటుంబ వ్యవస్థకు, గృహస్థుధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన నాలుగు మూల స్తంభాల్లో ‘మాతృదేవోభవ’ ‘పితృదేవోభవ’లను మొదటి రెండుగా చెబుతారు. వీటిలో అమ్మకు- పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక! ఇంటి వాకిటా వికాసాన్ని వెదజల్లే వీధిగడప దీపం నాన్నకు ప్రతీక! లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడంలో విచిత్రం ఏమీ లేదు. అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం!
అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ. నాన్న ప్రేమకు లోతెక్కువ. ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలూ ఒక్కటే అయినా- నాన్న అంత తొందరగా బయటపడడు కాబట్టి, అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం!
అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన. శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం.
బాల్యం నుంచి తాను పట్టి నడిపించిన చిటికెన వేలు, ఆ తరవాత తనకే కళ్ళజోడుగా మారి దారి చూపించడం నాన్నకు ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. అలా సంతానం తనకు చేతికర్రగా మారిన రోజున ‘ఆత్మావై పుత్రనామాసి’ (తానే భార్య గర్భాన పుత్రుడై జన్మిస్తాడు) అనే వేద వాక్యానికి తాత్పర్యం తండ్రికి ఎంతో ఆత్మీయంగా అనుభూతం అవుతుంది.
‘నాన్నల రోజు’న వారు ఆశించేది అపురూపమైన ఆ తీపి అనుభూతినే! తనయులు దాన్ని హృదయపూర్వకంగా తండ్రులకు అందించిన రోజున నాన్నల రోజు నిజంగా సార్థకం అవుతుంది. పితృరుణం తీరుతుంది. నిరంతరం పరుగులు తీసే కాల ధర్మం మూలాన- లోకంలో నాన్న లేకున్నా, ఆయననే మనసారా స్మరిద్దాం. ‘నాన్నకు జేజేలు’ పలుకుదాం!
- ఎర్రాప్రగడ రామకృష్ణ

ధైర్య వచనం

                                                                       ధైర్య వచనం

‘ఈ మాత్రలు సక్రమంగా వాడండి. నాలుగు రోజుల్లో మీరు మామూలు పనులన్నీ చేసుకోవచ్చు...’ అని వైద్యుడు చెప్పగానే- రోగి పెదవులపై చిరునవ్వు వెలిగింది. ఉపాధ్యాయుడు ‘మీరంతా కష్టపడి చదివారు. పరీక్షలు బాగా రాస్తారు...’ అనగానే- తరగతి గదిలో, దిగులు పోగొట్టే చప్పట్లు మార్మోగాయి. ‘అత్తమామలు నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటారు తల్లీ! ఈ మాట ఓ వారం తరవాత నువ్వే అంటావు’- తల్లి వూరడింపు కొత్తగా కాపురానికి వెళ్లే కుమార్తె బెంగను చాలావరకు తగ్గించింది. ‘నాన్నా! నలుగురు బిడ్డలున్నాం. పదవీ విరమణ చేసినా నీకు, అమ్మకు ఏ లోటూ రానివ్వం’- పెద్దకొడుకు హామీతో తండ్రి గుండె ఆనంద తరంగితమైంది. ఇవి ధైర్య వచనాలు. దైనందిన జీవితంలో ఇలాంటి సన్నివేశాలు వివిధ స్థాయి వ్యక్తుల్లో అసంఖ్యాకం. ఆప్తవాక్యం వూరటనిస్తుంది. ఆశ నింపుతుంది. కార్యానికి ప్రేరణ కలిగిస్తుంది.

‘ధైర్యం సర్వత్ర సాధకమ్‌’ ఆర్యోక్తి సర్వులకూ వర్తించినా, ధైర్యగుణాన్ని వశం చేసుకోవడం సులభసాధ్యం కాదు. దానికి సడలిపోయే లక్షణముంది. ధైర్యంతో మనసులో ఒక సంకల్పానికి బీజావాపనం కాగానే, దాని చుట్టూ ఎన్నో సంబంధిత అంశాలు పరిభ్రమిస్తాయి. సాధనోపాయాలు అన్వేషించేందుకు యత్నిస్తాయి. బుద్ధి వాటిని జల్లెడ పడుతుంది. చివరకు వివేకం ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ క్రమంలో, ధైర్య పరిమాణంలో స్వల్పంగానైనా మార్పు రావడం సహజం. మన పురాణేతిహాసాలు ఇందుకు ఎన్నో తార్కాణాలు చూపాయి.
ధైర్య వచనాలు, ఆప్తవాక్యాలు, సహానుభూతులు, అనునయం, ప్రోత్సాహాలు, ఆప్యాయత, ఆత్మీయత, హితోపదేశాలు- ఇటువంటివి కష్ట నివారణను సందర్భోచితంగా సూచించాయి. రామాయణం యుద్ధకాండలో ఒక విలక్షణ ఉదాహరణ ఉంది. రావణుడితో భీకర సమరంలో అలసిన రాముడు చింతామగ్నుడై ఉన్నప్పుడు అగస్త్య మహర్షి సమీపిస్తాడు. ‘రామ మహాబాహూ!’ అని సంబోధించి ధైర్యోన్నతి వర్ధిల్లజేసి- జయకరం, చింతాశోకనాశం, పరమ మంగళప్రదమైన ‘ఆదిత్య హృదయం’ జపిస్తాడు. రావణుణ్ని సంహరించమని ఉపదేశిస్తాడు. రాముడు అది పాటించి రావణుణ్ని వధిస్తాడు. అదీ, ధైర్యవచన ప్రభావం.
ఒక కోణంలో దర్శిస్తే ‘భగవద్గీత’ సుదీర్ఘ ధైర్యవచన సమాహారంగా తోస్తుంది. కౌరవ, పాండవ సేనల మధ్య నిలిచిన అర్జునుడు ఎదురుగా ఉన్న దాయాదులు, ఆచార్యులు, బంధుగణాన్ని చూసి శోకతప్తుడవుతాడు. ‘గాండీవం జారిపోతున్నది. నిలబడలేకున్నాను. స్వజనాన్ని ఎలా చంపగలను’ అని కృష్ణుడితో తీవ్ర వేదన వ్యక్తంచేస్తాడు. కృష్ణుడు గీతాబోధనతో ధైర్య వచనాల ద్వారా సవ్యసాచిని సమరోన్ముఖుణ్ని చేయగలిగాడు.
ఇటువంటి హితోక్తులు, వూరడింపులు, నిర్భయ భాషణం వంటివి పూర్వం కంటే నేడు మరింత ఆవశ్యకం. కాలం ఎంతో మారింది. స్వార్థచింతన, ధనార్జనాపేక్ష, హింసాప్రవృత్తి పెరిగాయి. విదేశీ ఉద్యోగావకాశాలు అధికమై, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తరిగిపోయి, సంతానమున్నా వయోధికులు ఏకాకులవుతున్నారు. జీవనశైలిలో పలు మార్పులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పలకరింపు, ఆపన్న హస్తం, సానుభూతి వంటివి సహాయకారులవుతాయి. వేదన తగ్గిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుతాయి. బాధల్ని కొంతైనా నివారిస్తాయి. ఆత్మహత్యల వంటి ఆవేశపూరిత చర్యలు తగ్గుతాయి. కుంగుబాటు నుంచి రక్షిస్తాయి. భయం అంతరిస్తుంది. ఆనందం మొలకెత్తుతుంది.
ఆర్తుల్ని ఆదుకునేందుకు కరుణ నిండిన హృదయం కావాలి. మన చుట్టూ ఎందరో ఆర్తులుంటారు. వారి బాధల్ని మాట సహాయం, మంచి పలకరింపుతో ఉపశమింపజేయవచ్చు. అది మనలో మానవీయత పెంచుతుంది. ఆర్తులకు సహాయం సకాలంలో అందుతుంది. అదే ధైర్యవచన ఫలితం.
- గోవిందరాజు రామకృష్ణారావు

జ్ఞాన క్షేత్రం


జ్ఞాన క్షేత్రం


‘జ్ఞానం ఎందుకు’ అనే ప్రశ్న అర్థం లేనిది. జ్ఞానమనేది ఓ దాహం, ఆర్తి. తీర్చుకుంటున్నకొద్దీ, అది ఇంకా పుడుతూనే ఉంటుంది. ఆ తపనను ఎవరూ ఆపలేరు.

మనిషి జ్ఞానంకోసం పుడతాడు. దాన్ని సంపాదిస్తాడు. ఆ జ్ఞానసాధనలోనే అతడి జీవితం నడుస్తుంది.
పుష్పాలు పరిమళాన్ని ఇస్తాయి. గాలి- ప్రాణంగా మారి మనిషిని నిలబెడుతుంది. ఆకాశం తన విశాలత్వాన్ని చాటుతుంటుంది. సమస్త ప్రకృతీ మనిషికి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే జ్ఞానం వేదమై, వెలుగై లోకంలో ప్రకాశిస్తుంటుంది.
శివుడు ఓ సందర్భంలో జ్ఞానగంగను కోరాడని పురాణాలు చెబుతాయి. అలాగే శ్రీరాముడు తన గురువు వసిష్ఠుడి వద్ద జ్ఞానం పొందాడు.
మనిషి అన్నం మరచిపోవచ్చు కానీ, జ్ఞానాన్ని మరవలేడు. మరవకూడదు. ఏది జ్ఞానం, అది ఎంతవరకు లభ్యమవుతుంది, దాని వల్ల ప్రయోజనం ఏమిటి అని అతడి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. తలుపులు తెరిస్తే, అసలైన జ్ఞానం దానికదే వచ్చి అతడి హృదయంలోకి చేరుతుంది. అదే శరీరానికి, మనసుకు, ఆత్మకు పుష్టినిస్తుంది.
పుస్తకాలతో లభించేది గొప్ప జ్ఞానం. ప్రకృతి నేర్పించేది- సహజమైన జ్ఞానం. జీవితం వల్ల కలిగేది, మనిషికి అన్నింటికంటే ముఖ్యమైనది అనుభూతిపరమైన జ్ఞానం. అది సూటిగా సరళంగా అతడి హృదయాన్ని తాకుతుంది. క్షణంలో ఎంతో మార్పుతెస్తుంది.
లోపలి జ్ఞానం వల్ల, మనసే మారిపోతుంది. మనిషి ఎదుట కొత్త దారులు తెరుచుకుంటాయి. యోగ రహస్యాలు తెలుస్తాయి. అతడిలో అప్పటివరకు నిక్షిప్తమై, అతడికే తెలియకుండా ఉన్న దివ్యత్వం అప్పుడు విప్పారుతుంది. నలువైపులా గుబాళిస్తుంది. ఆ బతుకు నందనవనంగా రూపొందుతుంది. జ్ఞానం కలగడం వల్ల, అప్పటిదాకా మృగంలా ఉన్న మనిషైనా నరుడవుతాడు. ఆ నరుడే నరోత్తముడిగా మారతాడు. నరోత్తముడు నారాయణుడిగా వెలుగుతాడు. అదంతా జ్ఞానఫలితమేనని స్వామి వివేకానంద అనేకమార్లు విశదీకరించారు.
పూర్ణజ్ఞానం పొందినవారు విలక్షణంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా రూపొందుతారు. జీవితం నుంచి ఏం పొందాలో కచ్చితంగా తెలుసుకుంటారు. వారు దార్శనికులు. లోకాన్ని దివ్యపథం వైపు నడిపించేది వారే. ఆ కృషిలో రాజ్యపూజ్యం లభించినా, ఒక్కోసారి అవమానం ఎదురైనా వారు చలించరు. ఆ రెండింటినీ సమంగా పరిగణించే స్థితప్రజ్ఞులు వారు!
ఇంత తిని, ఎంతో కొంత పనిచేసి, నిద్రించడమే జీవితగమ్యం అనుకునే స్థితి నుంచి మనిషిని వేరుచేసేది- జ్ఞానమే. సాధారణ ప్రాణికి, దివ్యమైన యోగికి ఉండే తేడాలు రెండు. ఒకటి జ్ఞానం, రెండోది బుద్ధి. వీటిని విస్మరించిననాడు మానవుడికి మనుగడే ఉండదు.
విశ్వం విస్తరిస్తోంది. అంతటా ప్రగతి కనిపిస్తోంది. అంతరిక్షమూ అనేక అవకాశాలు చూపిస్తోంది. అలాగే సరైన జ్ఞానం సంపాదించుకున్న నరుడే అందరికీ అన్నింటినీ సమకూర్చగలడు. ఆ మరో ప్రపంచం కోసమే ప్రతి ఒక్కరూ కలలు కనాలి. వాటికి మూలాధారం- జ్ఞానం. పూర్వం రుషులకు అటువంటి జ్ఞాన సంపదే ఉండేదని ఇతిహాసాలు చెబుతాయి.
కురుక్షేత్రంలో మొదట అర్జునుణ్ని విషాదం ఆవరించింది. శ్రీకృష్ణుడి ఎదుట చాలాసేపు అతడు అదే విషాదయోగంలో ఉన్నాడు. కురు సోదరులు, బంధుమిత్రులు, గురువులతో యుద్ధం చేయనన్నాడు. ఆ మాటలన్నీ విన్న కృష్ణుడు చివరికి జ్ఞానం అనే బాణం ప్రయోగించాడు. అదే అర్జునుడిలో శక్తిని నింపింది. అప్పుడు అతడు మహావీరుడిలా లేచి నిలుచున్నాడు. ఆ వెంటనే జ్ఞానానికి నమస్కరించాడు. విశ్వరూపమే ఆ జ్ఞానం!
యుద్ధం సాగింది. ‘చేసేది నీవు, చేయించేది నేను’ అంటూ అర్జునుణ్ని ముందుకు నడిపించాడు కృష్ణుడు. యుద్ధంలో గెలిపించాడు. ఎప్పటికైనా జ్ఞానక్షేత్రమే గొప్పదని ఆ కురుక్షేత్రంలో రుజువు చేశాడాయన!
- ఆనందసాయి స్వామి