Friday, August 24, 2018

ఆలోచనలు

ఆలోచనలు
 
నిషి మనసులో నిత్యం ఆలోచనలు ఊరుతుంటాయి. అవి సవ్యమైనవైతే పురోగతికి, అప సవ్యమైతే అధోగతికి దారితీస్తాయి. మనం తేరుకున్న నీటినే తాగుతాం. ఏరుకున్న కూరగాయల్నే తింటాం. జీవిత గమనంలో మేలైన వాటినే ఎంచుకుంటాం అన్నది సారాంశం. మస్తిష్కంలోని ఆలోచనల్ని ఎప్పటికప్పుడు వడపోత పోస్తుండాలి. అది నిరంతర అభ్యాసంతోనే అలవడుతుంది. ఆలోచనావిధానంలో ఎంతటి పరిపక్వత సాధిస్తే, జీవితం అంతటి ప్రయోజకత్వాన్ని సిద్ధించుకుంటుంది.
అడవిలో తూనీగలా తిరుగుతూ సతత హరితాల్ని, రంగురంగుల సువాసనలీనే పూలను, సంపూర్ణంగా విరిసిన కమలాలతో ఉన్న చెరువులను, జలజలా పారే సెలయేళ్లను, జంతుజాలాన్ని కళ్లింతలు చేసుకుని చూస్తూ అచ్చెరువొందుతున్న శూర్పణఖ కళ్లకు నార బట్టలతో, జటామండలంతో చెట్టుకింద కూచున్న రామయ్య కనపడ్డాడు. అప్పటిదాకా ప్రకృతి ధ్యాసలో, సవ్యదిశలో సాగుతున్న ఆమె ఆలోచనలు ఒక్కసారిగా పక్కదారి పట్టాయి. రుషిలా ఉన్న రాముడు మన్మథుడిలా కనిపించాడు. తనను పెళ్లిచేసుకొమ్మని అర్థించింది, బెదిరించింది. తాను ఏకపత్నీవ్రతుణ్నని, పెళ్లాడటం కుదరదని నచ్చజెప్ప ప్రయత్నించాడు రాముడు. వినకుండా మొండికేసింది. ఫలితంగా ముక్కూచెవులూ కోల్పోయింది. ఏడుస్తూ వెళ్లి విషయం అన్న రావణుడికి చెప్పింది.
రావణుడు ఎలాంటివాడు- నిష్ఠాగరిష్ఠుడు. శివుని మెప్పించినవాడు. చెల్లెలి మాటలు వినగానే అంతటి రావణబ్రహ్మ- ఆలోచనలు మందగించి, కోపంతో బుసలు కొడుతూ... అరణ్యంలో ఒంటరిగా ఉన్న అమ్మవారిని అపహరించాడు. భార్యతో సహా ఎంతమంది అది అధర్మమని చెప్పినా, ఆలోచనలను సవ్యమైన దిశలోకి మరల్చుకోలేకపోయాడు. చివరికి రాజ్యాన్ని, తనవాళ్లను, సమస్తాన్ని కోల్పోయాడు. ఆలోచనలెప్పుడూ నిర్మలంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అదుపు తప్పకూడదు.
ఆలోచనల్లో అనుమానపు బీజం పడితే, అతి తక్కువ సమయంలోనే అది మొలకెత్తి వటవృక్షమవుతుంది. రామరాజ్యంలో ఒక పౌరుడు అన్నమాటకు అంతటి ఉత్తమోత్తమ రాముడూ- అతడి మాట తనకు, రాజ్యానికి కళంకం అవుతుందేమో అన్న సంశయంతో ఆలోచనల్లో స్థిరత్వం కోల్పోయి ప్రాణానికి ప్రాణమైన సీతమ్మను అడవికి పంపి ఎంతో కుమిలిపోయాడు.
దేవకికి పుట్టబోయే అష్టమ సంతానం తనను చంపబోతోందని ఆకాశవాణి ద్వారా తెలిసి చెల్లెల్ని, బావను ఖైదు చేశాడు కంసుడు. పుట్టిన ఏ ఒక్క శిశువునూ వదలకుండా, పుట్టిన వెంటనే హతమార్చాడు. విధిని తప్పించుకోగలిగాడా, లేదు. మేనల్లుడు శ్రీకృష్ణుడి చేతిలో హతమయ్యాడు. చెల్లెల్ని హింసించిన అన్నగా చరిత్రలో అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. వక్రమార్గం పట్టిన ఆలోచనలకు సంపూర్ణ రూపం కౌరవులు. వారి అకృత్యాలను అక్షరబద్ధం చేసిన గ్రంథరాజమే మహాభారతం. కౌరవుల కుటిలత్వమే పాండవులను జనం దృష్టిలో ఉత్తములను చేసింది. ఉన్నతులుగా నిలబెట్టింది.
కుదురుగా సాగని ఆలోచనలు మనసును చంచలం చేస్తాయి. పదవిలో ఉన్నా, ఎవరివల్ల, ఎప్పుడు తన పదవికి ముప్పువాటిల్లుతుందో అన్న బెంగ ఇంద్రుడిది. ఎవరైనా కఠోర తపస్సు చేస్తే, తన పదవి, భోగభాగ్యాలన్నీ చేజారతాయని అనుక్షణం చింతాగ్రస్తుడై ఉంటాడు. స్వర్గంలోని ఆనందాన్ని తృప్తిగా అనుభవించలేని దౌర్భాగ్యం ఇంద్రుడిది.
ఆలోచనలన్నీ సత్యం మీద కేంద్రీకరించాడు కాబట్టే హరిశ్చంద్రుడు సత్యవాదిగా నిలిచాడు. స్వాతంత్య్రాన్ని సముపార్జించడంలో అందరూ మారణహోమం దిశగా అడుగులేస్తుంటే, అహింసాత్మక ఆలోచనలతో దాన్ని సాధించి, విదేశీయుల మనసులూ కొల్లగొట్టాడు కొల్లాయిగట్టిన గాంధీ. స్వచ్ఛమైన ఆలోచనలతోనే మనిషి ఆదర్శప్రాయుడవుతాడు. సమాజంలో చెక్కుచెదరని దేదీప్యమాన జ్యోతిగా వెలుగొందుతాడు!
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Thursday, July 7, 2016

సిరి సంపదలు

102                                                సిరి సంపదలు 

జీవితం స్థిరంగా ఉండేది కాదని, హెచ్చుతగ్గులు ఒడుదొడుకులు తప్పవని తెలిసినా మనిషి భావోద్వేగాలకు లోనవుతుంటాడు. ఎప్పుడూ ఏవో కొత్త అనుభవాలను మనిషికి జతచేస్తూ కాలం కదిలిపోతుంటుంది. ‘ఒకరు అదే నదికి రెండోసారి వెళ్లలేరు’ అంటారు ఒక గ్రీకు తత్వవేత్త. అంటే అంతర్గతంగా ఎంతో వేగంగా మారిపోతుంటుంది, స్థిరత్వం ఉండదని చెప్పడం! అలాగే అనుభవ సంపదా మారుతుంటుంది.
మనిషికి తెలియకుండానే నిన్నటి జ్ఞాపకాలు, రేపటి కలలు సంపదలుగా తోడుంటాయి. మనిషి గతానికి, భవిష్యత్తుకు అలవాటుగా అతుక్కుపోతుంటాడు. కాలానుగుణంగా ఎదురయ్యే అనుభవాలను సొంతం చేసుకుంటాడు. అవే సంపదలవుతాయి.
ఒక వ్యక్తి నిన్న తోటలోని బంగళాలో, ఈరోజు కార్యాలయంలో, రేపు పనిమీద తన వాహనంలోనో మరెక్కడో ఉన్నాడనుకుందాం. ఆ బంగళా, కార్యాలయం, వాహనం... అన్నింటినీ అతడు తనకు చెందిన సంపదలుగా భావిస్తాడు. వర్తమానంలో అవగాహనతో చూసినప్పుడు అది అంతా ఒక భ్రాంతి... మిథ్య! అవి అతడి సొంతమని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. భూత, భవిష్యత్‌, వర్తమానాల తాలూకు అనుభవాలు రకరకాలుగా వచ్చి చేరుతుంటాయి. అవి అతడి సంపదలుగా మారుతుంటాయి.
మనిషికి ఉండే సంపదలు అతణ్ని తృప్తిపరచలేకపోయినా, సంతోషంగా ఉండటానికి సహాయపడకపోయినా... అవి ఎంత గొప్పవైనా- వాటికి విలువ లేనట్లే. ఎన్నో వసతులున్న పడక గదిలో- అతడికి మనస్తాపం కలిగించే ఆలోచననో, అనారోగ్య కారణంగా ఇబ్బందినో ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ గదిలోని సౌకర్యాలను అనుభూతి చెందడం సాధ్యం కాదు. సంపదలోని సౌఖ్యాన్ని అనుభవించాలంటే, వర్తమానంలో మనిషి మనసు ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం.
నిత్యజీవితంలో మనిషి ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆ పని చేయడం యాంత్రికంగా మారుతుంది. ఆహారం తీసుకోవడం, ముస్తాబు కావడం, ప్రయాణం... అన్నీ ఒకదాని తరవాత మరొకటి తెలియకుండానే జరిగిపోతుంటాయి. అలా పట్టనట్లుగా సాగిపోయే పరిస్థితుల్లో అతడు ఉపయోగించే ఖరీదైన సాధనాలకు ప్రత్యేకంగా విలువ ఉండదు. కొంతకాలానికి అనుభూతిరహితంగా మారతాయి. అటువంటప్పుడు అవి ‘ఉన్నా లేకున్నా ఒక్కటే’ అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. అవి అందుబాటులో లేనప్పుడే, మళ్లీ కష్టం తెలుస్తుంది. అలవాటుపడిపోయిన ఆలోచనా విధానాన్ని ప్రశ్నించని పక్షంలో, ప్రపంచాన్ని మరో కోణంలో చూసే అవకాశం ఉండదు. విభిన్న సమయాల్లో, వేర్వేరు పరిస్థితుల్లో వాటి అసలు విలువ గుర్తించి మసలుకోవడమే మంచి లక్షణం.
సక్రమమైన అవగాహన జీవితంలో ప్రాధాన్యాల విషయంలో ఆలోచనకు ఆస్కారం కల్పిస్తుంది. ఏది అవసరం, ఎప్పుడు అవసరం... లాంటి ప్రశ్నలు వేసుకుంటే, కావాల్సిన సంపదను మాత్రమే కలిగి ఉండేలా చేస్తుంది. అప్పుడు జీవితం తృప్తిగా సాగిపోతుంది.
ఓ వ్యక్తి ఒకసారి ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతే, అది నిజంగా అతడిది కాదు. తరవాత అతడు తిరిగివచ్చి విశ్రాంతి తీసుకునేవరకు ఆ భావన మనసులో ఉంటుంది. మనసులో ఉన్న ప్రతిదీ అతడిది కావాలనీ లేదు. అటువంటప్పుడు, ప్రతి కలా వూహా అందరి సొంతమవుతాయి. ఆర్థిక స్తోమత లేనివారెందరో ఆ కలలు, వూహల్లో విహరిస్తుంటారు. వారికి అనుభూతితోనే జీవితం గడచిపోతుంది.
ఏ విధంగా ఆలోచించినా, జీవితంలో మనిషి అనుభవించేది సంపాదించుకున్నదాంట్లో కొద్ది భాగమే! అతడు సంతోషంగా ఉండేది మధుర జ్ఞాపకాల తాలూకు సంపదల వల్లనే!
సంపద అంతా వర్తమానంలోని నమూనా. అదే జీవితం. మనిషి ఆ సంపదను అనుభవించినప్పుడు, నమూనాగా మిగిలిపోతుంది. అనుభవించడానికి అక్కరకు రాని సంపద ఎంత ఉన్నా, వృథా కింద లెక్క! వర్తమానంలో కూడబెట్టడం ఒకెత్తు. కూడబెట్టినది అనుభవించడం మరొకెత్తు. అనుభవించగలగడం ఒక అదృష్టం!
- మంత్రవాది మహేశ్వర్‌
MIDI KEYBOARD

Sunday, July 3, 2016

98 వర్తమానం

వర్తమానం 
నిన్న జరిగిపోయింది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. నేడు నిజం, ఈ గంట నిజం. ఈ క్షణం నిజం. ఇది వర్తమానం. మరుక్షణమే అది గతమైపోతోంది... భవిష్యత్తు వూహల్లో వూరిస్తూ ఉంటోంది. ఎందరో తాత్వికులు ‘వర్తమానంలో జీవించు’ అని బోధిస్తుంటారు. వర్తమానం నిశ్చల ఛాయాచిత్రంలా ఉండదు. కదిలిపోతుంటుంది. కాలం ఎవరి కోసమూ ఆగదు. పరుగులు తీస్తూనే ఉంటుంది. వర్తమానం గురించి మాట్లాడుకునేలోపే అది గతమై జ్ఞాపకంలో నిలుస్తుంది.
ఒక గదిలో కూర్చుని కిటికీలోంచి చూస్తున్నప్పుడు సన్నటి వర్షపు తుంపర గడ్డిపూల మీద పడుతోంది... తుమ్మెదలు ఎగురుతున్నాయి. దృశ్యం తరవాత దృశ్యం కదలిపోతోంది... అది వర్తమానమా గతమా... ఇలా మారిపోతున్న దృశ్యాలు కోకొల్లలు... నేడు, నిన్న, రేపు... పుట్టుక, మరణం, పుట్టుక...
సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఈ తిరుగుడు విశ్వమంతా ఉంది. విశ్వం లోలోపల తిరుగుతూనే ఉంది. తిరక్కుండా ఏదీ లేదు. ఎంతో కొంత పౌనఃపున్యంతో అందరి శరీరాలు లోలోపల తిరుగుతూనే ఉన్నాయి. ఆ భ్రమణం కళ్లకు కనిపించదు. కానీ, భౌతికంగా మనం తిరుగుతున్నప్పుడే ఆ చలనం మనకు అనుభవమవుతుంది. మనం తిరక్కుండా ఒక దగ్గర కూర్చున్నప్పుడు కూడా మన లోపల సర్వమూ తిరుగుతూనే ఉంది. ఈ తిరుగుడు విశ్వానికి అనుసంధానమై ఉంది. దీనికి భక్తిని జోడిస్తే అది ప్రదక్షిణంగా మారుతుంది. ఈ ప్రదక్షిణాలు సవ్య, అపసవ్య దిశల్లో జగత్తంతా నిండి ఉన్నాయి. మన శరీరాన్ని ఆవరించి ఉన్న సూక్ష్మ శరీరంలో ఆరు చక్రాల మీద జీవుడు నిరంతరం ప్రదక్షిణలు చేస్తూనే ఉంటాడు అంటోంది యోగశాస్త్రం. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. జనన-మరణాలు ఒక వలయంగా ఏర్పడి జీవులను తిప్పుతూనే ఉంటాయి.
మరి వర్తమానం మాటేమిటి?దాన్ని పట్టుకోవాలనే ఉబలాటంలోనే ధ్యానం సాగుతుంది. ధ్యానం వర్తమానం. అది నిత్యనూతనం. కళ్లు మూసుకొని కాలాతీతమై పోవాలి. అప్పుడు మూడు కాలాలు ఒక్కటై పోతాయి. ఆనందసాగరంలో ఓలలాడతాం. కళ్లు తెరచి ఉన్నప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ, ఎవరితో ఉంటే వాళ్లతో వైరుధ్యాలకు అతీతంగా కలిసిపోవాలి. కలుపుగోలుగా ఆ క్షణాలను పండించుకొని బంధాలు కలుపుకొని ముందుకు సాగాలి. అదే ఆనంద వ్యవసాయం. చిన్న చిన్న విషయాల్లో కూడా తృప్తిని, ఆనందాన్ని పొందాలి. ఇలా వర్తమానం సాగాలి. రేపటికి మంచి స్మృతిని పదిలపరచుకోవాలి.
దివ్యత్వం ప్రకృతి రూపంలో ప్రతి క్షణం మాట్లాడుతోంది. మన మనసు పరధ్యానంలో పడిపోయి అవకాశాలను వదులుకుంటోంది. అటు జరిగిన దానిలోనో, ఇటు జరగబోయే దానిలోనో మనసు వూయలలూగి వర్తమాన క్షణాలను చెయ్యి జార్చుకుంటోంది. వేరే మాటల్లో కాలం కరిగిపోతోంది.
రాముడి గురించి చదువుతున్నప్పుడు మనసంతా ఆయనే నిండిపోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో మునిగిపోవాలి. తల దువ్వుకుంటున్నప్పుడు జుత్తు, దువ్వెన తప్ప తలలో రెండో ఆలోచన ఉండకూడదు. కాలం, ప్రకృతి, దివ్యత్వం ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటాయి. సరికొత్తగా ముస్తాబవుతుంటాయి. వర్తమానంలో ఉంటాయి. కలవాలనే ఇచ్ఛ మనకు ఎంత గాఢంగా ఉంటే అంత గాఢంగా మనం వాటిలో లీనమవగలం. ఈ రహస్యం తెలిసినవాడు సంతోషాన్ని నెమలి పింఛంగా ధరించి శ్రీకృష్ణుడిలా నిత్య వర్తమానంలో విహరిస్తాడు.
కాలం నుంచి తప్పించుకుపోయినప్పుడు ఎంతో ఆనంద పారవశ్యం కలుగుతుంది. మనసులో బొమ్మలన్నీ మాయమైపోతాయి. అవి ఉంటే కాలం ఉంటుంది. అవి అంతరించిపోయినప్పుడే కాలం కూడా అంతరించిపోతుంది. నిర్మల ‘వర్తమానం’ మాత్రం మిగులుతుంది. వర్తమానం అన్నది కాలంలో ఓ భాగంగా భాషలో మాత్రమే ఉంటుంది. వాస్తవంలో వర్తమానం కాలానికి అతీతంగా ఉంటుంది. ఆ వర్తమానంలో ఉండటమే ఆత్మస్థితిలో ఉండటం అంటారు ఓషో.

Thursday, June 30, 2016

97 శుద్ధ జలం

97                                                                          శుద్ధ జలం

ల్లాహ్‌ సృష్టిలోని అణువణువూ మానవులకు ఉపకరించేదే. భూమ్యాకాశాలు, లోయలు, పర్వత సానువులు, నదులు, సముద్రాలు, ఫలపుష్పాదులు, సజీవ నిర్జీవాలు...అన్నీ అత్యుత్తమ మనుగడ కోసమే. శుద్ధజలం మానవజాతి స్వచ్ఛతకు, ప్రాణరక్షణకు అత్యంత అవసరమైనది.‘నీరు పరిశుభ్రమైనది...ఏ వస్తువూ దాన్ని అపరిశుభ్రం చేయజాలదు.రెండు తొట్టెల కన్నా ఎక్కువగా ఉన్న నీటిలో మాలిన్యం పడినంత మాత్రాన అపరిశుద్ధం అయిపోదు...ఒకవేళ ఆ నీటి రంగు, రుచి, వాసన మారిపోతే తప్ప’ అని మహా ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ) అన్నారు.
‘మేము ఆకాశం నుంచి పరిశుద్ధ జలాన్ని అవతరింపజేశాము’ (ఖురాన్‌ 25:48) అని అల్లాహ్‌ తెలిపారు. ఇస్లాం ధర్మ నియమావళి ప్రకారం, ప్రతి నమాజుకు ముందు ఉజూ చేయాలి. ఉజూ కోసం నీరు కావాలి. ఉజూ చేసేటప్పుడు అవసరానికి మించి నీరు వాడరాదు. శరీర అవయవాలు అన్నింటినీ నీటితో కడిగేందుకు వీలులేనప్పుడు తడి చేత్తో తుడిచేందుకు ఇస్లాం అనుమతిస్తోంది.
మానవ జీవితంతో మమేకమైన నీటి వాడక ప్రాశస్త్యాన్ని పవిత్ర ఖురాన్‌ గ్రంథం తెలియజెబుతోంది. వర్షం కోసం చేసే ప్రత్యేక నమాజు ఇస్తిస్ఖా నమాజు. పండుగ నమాజులాగా దీన్ని సామూహికంగా ఈద్గాహ్‌లో ‘రెండు రకాతులు’ చేయాలి. ‘యా అల్లాహ్‌... దాహాన్ని తీర్చేది,ప్రయోజనకరమైనది, ఆలస్యం కాకుండాధరిత్రికిధారాపాతంగా చేరేదీ అయిన వర్షం కురిపించి దాహార్తిని తీర్చు. నీ దాసులకు, నోరులేని నీ జంతువులకు నీళ్ళు తాగించు. నీ కారుణ్య వర్షాన్ని అందరిపై కురిపించు’ అని అల్లాహ్‌ను ప్రార్థిస్తారు.
మహా ప్రవక్త ప్రబోధించిన విధంగా అల్లాహ్‌ మూడు రకాల మనుషుల్ని కరుణించడు. మొదటివారు తమ వర్తకపు సరకు గురించి అసత్య ప్రమాణం చేసేవారు, రెండోవారు తోటి మానవుల ధనంపై ఆశ కలిగినవారు. మూడోవారు ‘తమ అవసరానికి మించి నీటిని నిలుపుకొనేవారు’. దైవ సందేశహరులు (స.అ.వ) సహచరుల్ని ఉద్దేశించి ఇలా ప్రబోధించారు. ‘ప్రళయదినాన నేను కౌసర్‌ కోనేటి వద్దకు మీకంటే ముందే చేరి, మీకు ఎదురువచ్చి స్వాగతం పలుకుతాను. మీ దాహం తీర్చే ఏర్పాటుచేస్తాను. నా వద్దకు చేరగలిగిన ప్రతి వ్యక్తీ ఆ కోనేటి నీరు తాగుతాడు. మరెప్పుడూ అతడికి దాహం వేయదు. ధార్మిక విషయాల్లో ధర్మవిరుద్ధ విషయాలను మిశ్రమం చేసిన వారు ఇటు చేరలేరు, శాశ్వతంగా దాహార్తిని తీర్చుకోనూ లేరు’. నైతిక ధర్మాచరణకు, దాహార్తికి గల సంబంధం అసమానమైనది.
జకాత్‌ దానం కూడా నీటితో ముడివడి ఉంది. ఏ భూములైతే వర్షపునీరు లేక, సెలయేటి నీరూ లేక సాగుబడి అవుతాయో వాటి పంటలో పదో వంతును; ఏ భూములైతే నీటిపారుదల సమృద్ధిగా ఉండి సాగు అవుతాయో వాటి పంటలో ఇరవయ్యో వంతును జకాత్‌ దానంగా చెల్లించాలని ప్రవక్త (స.అ.వ) ఆదేశించారు. ఇది వ్యవసాయం చేసేవారి విధి. నీటి దానం గురించి ప్రవక్త (స.అ.వ.) ప్రస్తావించారు. ‘దారినపోయే ఒక వ్యక్తికి బాగా దాహం వేసింది. అటూ ఇటూ వెతికాడు. ఒక బావి కనిపించింది. అందులో దిగి నీళ్ళు తాగాడు. వెలుపలికి వచ్చిన తరవాత, ఒక కుక్కపిల్ల దప్పిక వల్ల నాలుక చాచి తడి మన్నును తినడం గమనించాడు. దాని దురవస్థకు జాలిపడి బావిలోకి దిగాడు. తన చర్మపు మేజోడులో నీళ్ళు నింపి, నోటితో పట్టుకొని వెలుపలికి వచ్చి, కుక్కపిల్లకు ఆ నీరు తాగించాడు. అల్లాహ్‌ ఆ వ్యక్తి చేసిన పనికి ప్రసన్నుడయ్యారు.కనుక ఏ ప్రాణిపట్ల దయచూపి దాహార్తి తీర్చినా పుణ్యం కలుగుతుంది’.
జీవనావసరమైన నీటిని, కూర్చొని రెండు లేక మూడు గుక్కల్లో తాగాలి. జమ్‌ జమ్‌ పవిత్ర జలాన్ని మాత్రం నిలబడి కాబా గృహం వైపు తిరిగి దుఆ చేసుకొని తాగాలి.
నీటిని పవిత్రంగా, అల్లాహ్‌ కరుణగా భావించాలి. ఉపవాస దీక్ష విరమణ చేసే విశ్వాసులందరూ దాహం తీర్చుకొని అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలి. చక్కటి వర్షాల కోసం, పవిత్ర రమదాన్‌ మాసంలో అందరం ప్రార్థిద్దాం!
- షేక్‌ బషీరున్నీసా బేగం

52 అమృత పుత్రులు

అమృత పుత్రులు
గవంతుడి పట్ల భక్తుడు పెంపొందించుకొనే ప్రేమ- వేదవిహిత కర్మలకన్నా, యోగసాధనకన్నా, జ్ఞానంకన్నా అత్యున్నతమైనది. అటువంటి భక్తి ఉదయించినప్పుడు, దానితో కోరికలు తీర్చుకోవడం తప్పు. అన్ని కోరికలూ దాటిన తరవాతే నిజమైన భగవద్భక్తి ప్రభవిస్తుంది. ఆ భక్తి భగవంతుడి నుంచి తిరిగి ఏమీ కోరదు.
మనిషి ప్రేమించినప్పుడు, ఆ ప్రేమలో అనేక వాంఛలు ఉంటాయి. దివ్య ప్రేమ అనే సూర్యుడు మనో దిక్‌మండలంపై ప్రకాశించగానే, అన్ని పనుల భారాన్నీ భగవంతుడికే వదిలివేయాలి. అటువంటి ప్రేమ సాధించడం కష్టమే!
ప్రేమ మూడు రకాలుగా ఉంటుంది. తాను ఏమీ ఇవ్వకుండానే, ఎదుటి నుంచి కోరుతుండేది ఒక రకం. రెండోది- ‘నేను ప్రేమిస్తాను. దానికి బదులుగా నాకు ఏదైనా ఇవ్వు’ అనేది. అది వస్తుమారక పద్ధతి లాంటిది. మూడో రకమైన ప్రేమ, తిరిగి దేన్నీ ఆశించదు. ఆ ప్రేమలోనే భక్తులు లీనం కావాలి. ప్రేమే సర్వస్వంగా, అదే వారి తుది గమ్యంగా సాగాలి.
ఆ ప్రేమలో ఆత్మ ఒక కాంతిధారలా భగవంతుడి వైపు ప్రవహిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ధనమో పేరుప్రఖ్యాతులో కావాలని కోరుకునేంత వ్యవధి ఉండదు. భగవంతుడు తప్ప, భక్తుడిలో వేరే ఆలోచనే కలగదు. ఆ ప్రేమభరిత స్థితిలో అతడిలో ఓ అనంతమైన, అద్భుతమైన ఆనందం ఉద్భవిస్తుంది. నిరంతరమూ ప్రవహించే ప్రేమామృత ధార అది!
అన్నింటికంటే ప్రేమను తేలికగా పొందవచ్చు. దానికి తర్కంతో పని లేదు. ఎవరూ ఎటువంటి ప్రదర్శనా ఇవ్వనక్కర్లేదు. రుజువులు చూపించాల్సిన పని అసలే ఉండదు.
హేతువు వల్ల, మన బుద్ధి ప్రతిదాన్నీ పరిమితం చేస్తుంది. అప్పుడు మనం ఒక వల విసురుతాం. అందినదాన్ని పట్టుకుంటాం. అది అందరికీ కనిపిస్తుంది. భగవంతుడి ప్రేమ అంత సులువుగా దొరికేది కాదు. ఆ ప్రేమ- కాలానికి అతీతమైంది. అది నిరపేక్ష మాధుర్యం!
ఒక హంతకుడు తన పిల్లవాణ్ని ముద్దాడినప్పుడు, ఆ ఒక్కక్షణం అతడిలో ప్రేమే కనిపిస్తుంది. మిగతా అన్నింటినీ విస్మరిస్తాడు. అదీ ప్రేమ గొప్పతనం!
స్వార్థచింతన, అహంకారం, కోపతాపాలు, కామవికారాలు- అన్నింటినీ భగవదగ్నిలో సమిధల్ని చేయాలి. వాటిని అలా దగ్ధం చేస్తే, మిగిలేది ప్రేమే!
‘సృష్టి సమస్తం దైవమయమే! ఆ దైవం పులి రూపంలో ఉంటే, భక్తుడు విడనాడటం మంచిది. జలాల్లోనూ భగవంతుడున్నాడు. అలా అని భక్తుడు కాలుష్య జలం బారిన పడకూడదు’ అని శ్రీరామకృష్ణ పరమహంస హితవు పలికేవారు.
భగవంతుడికి తమను తాము అర్పణ చేసుకొన్న భక్తులు, ప్రపంచం కోసం మరింత ఎక్కువ కృషిచేస్తారు. వారంతా భగవంతుడి పట్ల భక్తిజ్వాలలో పునీతులైనవారు. వారు పాటించే పరిశుభ్రత, ఆచరించే నిశ్శబ్దం నుంచి దైవశక్తి సంబంధిత వాక్కు లభిస్తుంది. అలాంటి మహాభక్తుల సాన్నిధ్యం దొరకడం ఎవరికైనా చాలా కష్టం! భక్తితత్పరుల సమక్షంలో కొన్ని నిమిషాలు గడిపినా చాలు- జీవితమంతా పూర్తిగా మారిపోతుంది.
భగవంతుణ్ని ప్రేమించేవారి సన్నిధి, లేదా వారు ఉండే చోటు ఓ పవిత్ర మందిరంగా మారుతుంది. ఆ భక్తులూ భగవత్‌ స్వరూపులే! వారి పలుకులు వేదాల వంటివి. పరమభక్తుల మాటల మాధుర్యం వల్లనే, ఆ ప్రాంతం మరో బృందావనంగా శోభిల్లుతుంది. ఆ భక్తులు దైవశక్తి అనే దివ్యకాంతిలో మెరిసేవారు. ఆ దైవానికి వారే అమృతపుత్రులు!
- కె.యజ్ఞన్న