మనిషి ప్రేమించినప్పుడు, ఆ ప్రేమలో అనేక వాంఛలు ఉంటాయి. దివ్య ప్రేమ అనే సూర్యుడు మనో దిక్‌మండలంపై ప్రకాశించగానే, అన్ని పనుల భారాన్నీ భగవంతుడికే వదిలివేయాలి. అటువంటి ప్రేమ సాధించడం కష్టమే!
ప్రేమ మూడు రకాలుగా ఉంటుంది. తాను ఏమీ ఇవ్వకుండానే, ఎదుటి నుంచి కోరుతుండేది ఒక రకం. రెండోది- ‘నేను ప్రేమిస్తాను. దానికి బదులుగా నాకు ఏదైనా ఇవ్వు’ అనేది. అది వస్తుమారక పద్ధతి లాంటిది. మూడో రకమైన ప్రేమ, తిరిగి దేన్నీ ఆశించదు. ఆ ప్రేమలోనే భక్తులు లీనం కావాలి. ప్రేమే సర్వస్వంగా, అదే వారి తుది గమ్యంగా సాగాలి.
ఆ ప్రేమలో ఆత్మ ఒక కాంతిధారలా భగవంతుడి వైపు ప్రవహిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ధనమో పేరుప్రఖ్యాతులో కావాలని కోరుకునేంత వ్యవధి ఉండదు. భగవంతుడు తప్ప, భక్తుడిలో వేరే ఆలోచనే కలగదు. ఆ ప్రేమభరిత స్థితిలో అతడిలో ఓ అనంతమైన, అద్భుతమైన ఆనందం ఉద్భవిస్తుంది. నిరంతరమూ ప్రవహించే ప్రేమామృత ధార అది!
అన్నింటికంటే ప్రేమను తేలికగా పొందవచ్చు. దానికి తర్కంతో పని లేదు. ఎవరూ ఎటువంటి ప్రదర్శనా ఇవ్వనక్కర్లేదు. రుజువులు చూపించాల్సిన పని అసలే ఉండదు.
హేతువు వల్ల, మన బుద్ధి ప్రతిదాన్నీ పరిమితం చేస్తుంది. అప్పుడు మనం ఒక వల విసురుతాం. అందినదాన్ని పట్టుకుంటాం. అది అందరికీ కనిపిస్తుంది. భగవంతుడి ప్రేమ అంత సులువుగా దొరికేది కాదు. ఆ ప్రేమ- కాలానికి అతీతమైంది. అది నిరపేక్ష మాధుర్యం!
ఒక హంతకుడు తన పిల్లవాణ్ని ముద్దాడినప్పుడు, ఆ ఒక్కక్షణం అతడిలో ప్రేమే కనిపిస్తుంది. మిగతా అన్నింటినీ విస్మరిస్తాడు. అదీ ప్రేమ గొప్పతనం!
స్వార్థచింతన, అహంకారం, కోపతాపాలు, కామవికారాలు- అన్నింటినీ భగవదగ్నిలో సమిధల్ని చేయాలి. వాటిని అలా దగ్ధం చేస్తే, మిగిలేది ప్రేమే!
‘సృష్టి సమస్తం దైవమయమే! ఆ దైవం పులి రూపంలో ఉంటే, భక్తుడు విడనాడటం మంచిది. జలాల్లోనూ భగవంతుడున్నాడు. అలా అని భక్తుడు కాలుష్య జలం బారిన పడకూడదు’ అని శ్రీరామకృష్ణ పరమహంస హితవు పలికేవారు.
భగవంతుడికి తమను తాము అర్పణ చేసుకొన్న భక్తులు, ప్రపంచం కోసం మరింత ఎక్కువ కృషిచేస్తారు. వారంతా భగవంతుడి పట్ల భక్తిజ్వాలలో పునీతులైనవారు. వారు పాటించే పరిశుభ్రత, ఆచరించే నిశ్శబ్దం నుంచి దైవశక్తి సంబంధిత వాక్కు లభిస్తుంది. అలాంటి మహాభక్తుల సాన్నిధ్యం దొరకడం ఎవరికైనా చాలా కష్టం! భక్తితత్పరుల సమక్షంలో కొన్ని నిమిషాలు గడిపినా చాలు- జీవితమంతా పూర్తిగా మారిపోతుంది.
భగవంతుణ్ని ప్రేమించేవారి సన్నిధి, లేదా వారు ఉండే చోటు ఓ పవిత్ర మందిరంగా మారుతుంది. ఆ భక్తులూ భగవత్ స్వరూపులే! వారి పలుకులు వేదాల వంటివి. పరమభక్తుల మాటల మాధుర్యం వల్లనే, ఆ ప్రాంతం మరో బృందావనంగా శోభిల్లుతుంది. ఆ భక్తులు దైవశక్తి అనే దివ్యకాంతిలో మెరిసేవారు. ఆ దైవానికి వారే అమృతపుత్రులు!
- కె.యజ్ఞన్న
No comments:
Post a Comment