Friday, October 7, 2016
Thursday, July 7, 2016
సిరి సంపదలు
102 సిరి సంపదలు
జీవితం స్థిరంగా ఉండేది కాదని, హెచ్చుతగ్గులు ఒడుదొడుకులు తప్పవని తెలిసినా మనిషి భావోద్వేగాలకు లోనవుతుంటాడు. ఎప్పుడూ ఏవో కొత్త అనుభవాలను మనిషికి జతచేస్తూ కాలం కదిలిపోతుంటుంది. ‘ఒకరు అదే నదికి రెండోసారి వెళ్లలేరు’ అంటారు ఒక గ్రీకు తత్వవేత్త. అంటే అంతర్గతంగా ఎంతో వేగంగా మారిపోతుంటుంది, స్థిరత్వం ఉండదని చెప్పడం! అలాగే అనుభవ సంపదా మారుతుంటుంది.
మనిషికి తెలియకుండానే నిన్నటి జ్ఞాపకాలు, రేపటి కలలు సంపదలుగా తోడుంటాయి. మనిషి గతానికి, భవిష్యత్తుకు అలవాటుగా అతుక్కుపోతుంటాడు. కాలానుగుణంగా ఎదురయ్యే అనుభవాలను సొంతం చేసుకుంటాడు. అవే సంపదలవుతాయి.
ఒక వ్యక్తి నిన్న తోటలోని బంగళాలో, ఈరోజు కార్యాలయంలో, రేపు పనిమీద తన వాహనంలోనో మరెక్కడో ఉన్నాడనుకుందాం. ఆ బంగళా, కార్యాలయం, వాహనం... అన్నింటినీ అతడు తనకు చెందిన సంపదలుగా భావిస్తాడు. వర్తమానంలో అవగాహనతో చూసినప్పుడు అది అంతా ఒక భ్రాంతి... మిథ్య! అవి అతడి సొంతమని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. భూత, భవిష్యత్, వర్తమానాల తాలూకు అనుభవాలు రకరకాలుగా వచ్చి చేరుతుంటాయి. అవి అతడి సంపదలుగా మారుతుంటాయి.
మనిషికి ఉండే సంపదలు అతణ్ని తృప్తిపరచలేకపోయినా, సంతోషంగా ఉండటానికి సహాయపడకపోయినా... అవి ఎంత గొప్పవైనా- వాటికి విలువ లేనట్లే. ఎన్నో వసతులున్న పడక గదిలో- అతడికి మనస్తాపం కలిగించే ఆలోచననో, అనారోగ్య కారణంగా ఇబ్బందినో ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ గదిలోని సౌకర్యాలను అనుభూతి చెందడం సాధ్యం కాదు. సంపదలోని సౌఖ్యాన్ని అనుభవించాలంటే, వర్తమానంలో మనిషి మనసు ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం.
నిత్యజీవితంలో మనిషి ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాడు. ఆ పని చేయడం యాంత్రికంగా మారుతుంది. ఆహారం తీసుకోవడం, ముస్తాబు కావడం, ప్రయాణం... అన్నీ ఒకదాని తరవాత మరొకటి తెలియకుండానే జరిగిపోతుంటాయి. అలా పట్టనట్లుగా సాగిపోయే పరిస్థితుల్లో అతడు ఉపయోగించే ఖరీదైన సాధనాలకు ప్రత్యేకంగా విలువ ఉండదు. కొంతకాలానికి అనుభూతిరహితంగా మారతాయి. అటువంటప్పుడు అవి ‘ఉన్నా లేకున్నా ఒక్కటే’ అన్నట్లుగా పరిస్థితి తయారవుతుంది. అవి అందుబాటులో లేనప్పుడే, మళ్లీ కష్టం తెలుస్తుంది. అలవాటుపడిపోయిన ఆలోచనా విధానాన్ని ప్రశ్నించని పక్షంలో, ప్రపంచాన్ని మరో కోణంలో చూసే అవకాశం ఉండదు. విభిన్న సమయాల్లో, వేర్వేరు పరిస్థితుల్లో వాటి అసలు విలువ గుర్తించి మసలుకోవడమే మంచి లక్షణం.
సక్రమమైన అవగాహన జీవితంలో ప్రాధాన్యాల విషయంలో ఆలోచనకు ఆస్కారం కల్పిస్తుంది. ఏది అవసరం, ఎప్పుడు అవసరం... లాంటి ప్రశ్నలు వేసుకుంటే, కావాల్సిన సంపదను మాత్రమే కలిగి ఉండేలా చేస్తుంది. అప్పుడు జీవితం తృప్తిగా సాగిపోతుంది.
ఓ వ్యక్తి ఒకసారి ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతే, అది నిజంగా అతడిది కాదు. తరవాత అతడు తిరిగివచ్చి విశ్రాంతి తీసుకునేవరకు ఆ భావన మనసులో ఉంటుంది. మనసులో ఉన్న ప్రతిదీ అతడిది కావాలనీ లేదు. అటువంటప్పుడు, ప్రతి కలా వూహా అందరి సొంతమవుతాయి. ఆర్థిక స్తోమత లేనివారెందరో ఆ కలలు, వూహల్లో విహరిస్తుంటారు. వారికి అనుభూతితోనే జీవితం గడచిపోతుంది.
ఏ విధంగా ఆలోచించినా, జీవితంలో మనిషి అనుభవించేది సంపాదించుకున్నదాంట్లో కొద్ది భాగమే! అతడు సంతోషంగా ఉండేది మధుర జ్ఞాపకాల తాలూకు సంపదల వల్లనే!
సంపద అంతా వర్తమానంలోని నమూనా. అదే జీవితం. మనిషి ఆ సంపదను అనుభవించినప్పుడు, నమూనాగా మిగిలిపోతుంది. అనుభవించడానికి అక్కరకు రాని సంపద ఎంత ఉన్నా, వృథా కింద లెక్క! వర్తమానంలో కూడబెట్టడం ఒకెత్తు. కూడబెట్టినది అనుభవించడం మరొకెత్తు. అనుభవించగలగడం ఒక అదృష్టం!
Sunday, July 3, 2016
98 వర్తమానం
వర్తమానం
ఒక గదిలో కూర్చుని కిటికీలోంచి చూస్తున్నప్పుడు సన్నటి వర్షపు తుంపర గడ్డిపూల మీద పడుతోంది... తుమ్మెదలు ఎగురుతున్నాయి. దృశ్యం తరవాత దృశ్యం కదలిపోతోంది... అది వర్తమానమా గతమా... ఇలా మారిపోతున్న దృశ్యాలు కోకొల్లలు... నేడు, నిన్న, రేపు... పుట్టుక, మరణం, పుట్టుక...
సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి. భూమి తనలో తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. ఈ తిరుగుడు విశ్వమంతా ఉంది. విశ్వం లోలోపల తిరుగుతూనే ఉంది. తిరక్కుండా ఏదీ లేదు. ఎంతో కొంత పౌనఃపున్యంతో అందరి శరీరాలు లోలోపల తిరుగుతూనే ఉన్నాయి. ఆ భ్రమణం కళ్లకు కనిపించదు. కానీ, భౌతికంగా మనం తిరుగుతున్నప్పుడే ఆ చలనం మనకు అనుభవమవుతుంది. మనం తిరక్కుండా ఒక దగ్గర కూర్చున్నప్పుడు కూడా మన లోపల సర్వమూ తిరుగుతూనే ఉంది. ఈ తిరుగుడు విశ్వానికి అనుసంధానమై ఉంది. దీనికి భక్తిని జోడిస్తే అది ప్రదక్షిణంగా మారుతుంది. ఈ ప్రదక్షిణాలు సవ్య, అపసవ్య దిశల్లో జగత్తంతా నిండి ఉన్నాయి. మన శరీరాన్ని ఆవరించి ఉన్న సూక్ష్మ శరీరంలో ఆరు చక్రాల మీద జీవుడు నిరంతరం ప్రదక్షిణలు చేస్తూనే ఉంటాడు అంటోంది యోగశాస్త్రం. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. జనన-మరణాలు ఒక వలయంగా ఏర్పడి జీవులను తిప్పుతూనే ఉంటాయి.
మరి వర్తమానం మాటేమిటి?దాన్ని పట్టుకోవాలనే ఉబలాటంలోనే ధ్యానం సాగుతుంది. ధ్యానం వర్తమానం. అది నిత్యనూతనం. కళ్లు మూసుకొని కాలాతీతమై పోవాలి. అప్పుడు మూడు కాలాలు ఒక్కటై పోతాయి. ఆనందసాగరంలో ఓలలాడతాం. కళ్లు తెరచి ఉన్నప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ, ఎవరితో ఉంటే వాళ్లతో వైరుధ్యాలకు అతీతంగా కలిసిపోవాలి. కలుపుగోలుగా ఆ క్షణాలను పండించుకొని బంధాలు కలుపుకొని ముందుకు సాగాలి. అదే ఆనంద వ్యవసాయం. చిన్న చిన్న విషయాల్లో కూడా తృప్తిని, ఆనందాన్ని పొందాలి. ఇలా వర్తమానం సాగాలి. రేపటికి మంచి స్మృతిని పదిలపరచుకోవాలి.
దివ్యత్వం ప్రకృతి రూపంలో ప్రతి క్షణం మాట్లాడుతోంది. మన మనసు పరధ్యానంలో పడిపోయి అవకాశాలను వదులుకుంటోంది. అటు జరిగిన దానిలోనో, ఇటు జరగబోయే దానిలోనో మనసు వూయలలూగి వర్తమాన క్షణాలను చెయ్యి జార్చుకుంటోంది. వేరే మాటల్లో కాలం కరిగిపోతోంది.
రాముడి గురించి చదువుతున్నప్పుడు మనసంతా ఆయనే నిండిపోవాలి. ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానంలో మునిగిపోవాలి. తల దువ్వుకుంటున్నప్పుడు జుత్తు, దువ్వెన తప్ప తలలో రెండో ఆలోచన ఉండకూడదు. కాలం, ప్రకృతి, దివ్యత్వం ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటాయి. సరికొత్తగా ముస్తాబవుతుంటాయి. వర్తమానంలో ఉంటాయి. కలవాలనే ఇచ్ఛ మనకు ఎంత గాఢంగా ఉంటే అంత గాఢంగా మనం వాటిలో లీనమవగలం. ఈ రహస్యం తెలిసినవాడు సంతోషాన్ని నెమలి పింఛంగా ధరించి శ్రీకృష్ణుడిలా నిత్య వర్తమానంలో విహరిస్తాడు.
కాలం నుంచి తప్పించుకుపోయినప్పుడు ఎంతో ఆనంద పారవశ్యం కలుగుతుంది. మనసులో బొమ్మలన్నీ మాయమైపోతాయి. అవి ఉంటే కాలం ఉంటుంది. అవి అంతరించిపోయినప్పుడే కాలం కూడా అంతరించిపోతుంది. నిర్మల ‘వర్తమానం’ మాత్రం మిగులుతుంది. వర్తమానం అన్నది కాలంలో ఓ భాగంగా భాషలో మాత్రమే ఉంటుంది. వాస్తవంలో వర్తమానం కాలానికి అతీతంగా ఉంటుంది. ఆ వర్తమానంలో ఉండటమే ఆత్మస్థితిలో ఉండటం అంటారు ఓషో.
Thursday, June 30, 2016
97 శుద్ధ జలం
97 శుద్ధ జలం
అల్లాహ్ సృష్టిలోని అణువణువూ మానవులకు ఉపకరించేదే. భూమ్యాకాశాలు, లోయలు, పర్వత సానువులు, నదులు, సముద్రాలు, ఫలపుష్పాదులు, సజీవ నిర్జీవాలు...అన్నీ అత్యుత్తమ మనుగడ కోసమే. శుద్ధజలం మానవజాతి స్వచ్ఛతకు, ప్రాణరక్షణకు అత్యంత అవసరమైనది.‘నీరు పరిశుభ్రమైనది...ఏ వస్తువూ దాన్ని అపరిశుభ్రం చేయజాలదు.రెండు తొట్టెల కన్నా ఎక్కువగా ఉన్న నీటిలో మాలిన్యం పడినంత మాత్రాన అపరిశుద్ధం అయిపోదు...ఒకవేళ ఆ నీటి రంగు, రుచి, వాసన మారిపోతే తప్ప’ అని మహా ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ) అన్నారు.

‘మేము ఆకాశం నుంచి పరిశుద్ధ జలాన్ని అవతరింపజేశాము’ (ఖురాన్ 25:48) అని అల్లాహ్ తెలిపారు. ఇస్లాం ధర్మ నియమావళి ప్రకారం, ప్రతి నమాజుకు ముందు ఉజూ చేయాలి. ఉజూ కోసం నీరు కావాలి. ఉజూ చేసేటప్పుడు అవసరానికి మించి నీరు వాడరాదు. శరీర అవయవాలు అన్నింటినీ నీటితో కడిగేందుకు వీలులేనప్పుడు తడి చేత్తో తుడిచేందుకు ఇస్లాం అనుమతిస్తోంది.
మానవ జీవితంతో మమేకమైన నీటి వాడక ప్రాశస్త్యాన్ని పవిత్ర ఖురాన్ గ్రంథం తెలియజెబుతోంది. వర్షం కోసం చేసే ప్రత్యేక నమాజు ఇస్తిస్ఖా నమాజు. పండుగ నమాజులాగా దీన్ని సామూహికంగా ఈద్గాహ్‌లో ‘రెండు రకాతులు’ చేయాలి. ‘యా అల్లాహ్... దాహాన్ని తీర్చేది,ప్రయోజనకరమైనది, ఆలస్యం కాకుండాధరిత్రికిధారాపాతంగా చేరేదీ అయిన వర్షం కురిపించి దాహార్తిని తీర్చు. నీ దాసులకు, నోరులేని నీ జంతువులకు నీళ్ళు తాగించు. నీ కారుణ్య వర్షాన్ని అందరిపై కురిపించు’ అని అల్లాహ్‌ను ప్రార్థిస్తారు.
మహా ప్రవక్త ప్రబోధించిన విధంగా అల్లాహ్ మూడు రకాల మనుషుల్ని కరుణించడు. మొదటివారు తమ వర్తకపు సరకు గురించి అసత్య ప్రమాణం చేసేవారు, రెండోవారు తోటి మానవుల ధనంపై ఆశ కలిగినవారు. మూడోవారు ‘తమ అవసరానికి మించి నీటిని నిలుపుకొనేవారు’. దైవ సందేశహరులు (స.అ.వ) సహచరుల్ని ఉద్దేశించి ఇలా ప్రబోధించారు. ‘ప్రళయదినాన నేను కౌసర్ కోనేటి వద్దకు మీకంటే ముందే చేరి, మీకు ఎదురువచ్చి స్వాగతం పలుకుతాను. మీ దాహం తీర్చే ఏర్పాటుచేస్తాను. నా వద్దకు చేరగలిగిన ప్రతి వ్యక్తీ ఆ కోనేటి నీరు తాగుతాడు. మరెప్పుడూ అతడికి దాహం వేయదు. ధార్మిక విషయాల్లో ధర్మవిరుద్ధ విషయాలను మిశ్రమం చేసిన వారు ఇటు చేరలేరు, శాశ్వతంగా దాహార్తిని తీర్చుకోనూ లేరు’. నైతిక ధర్మాచరణకు, దాహార్తికి గల సంబంధం అసమానమైనది.
జకాత్ దానం కూడా నీటితో ముడివడి ఉంది. ఏ భూములైతే వర్షపునీరు లేక, సెలయేటి నీరూ లేక సాగుబడి అవుతాయో వాటి పంటలో పదో వంతును; ఏ భూములైతే నీటిపారుదల సమృద్ధిగా ఉండి సాగు అవుతాయో వాటి పంటలో ఇరవయ్యో వంతును జకాత్ దానంగా చెల్లించాలని ప్రవక్త (స.అ.వ) ఆదేశించారు. ఇది వ్యవసాయం చేసేవారి విధి. నీటి దానం గురించి ప్రవక్త (స.అ.వ.) ప్రస్తావించారు. ‘దారినపోయే ఒక వ్యక్తికి బాగా దాహం వేసింది. అటూ ఇటూ వెతికాడు. ఒక బావి కనిపించింది. అందులో దిగి నీళ్ళు తాగాడు. వెలుపలికి వచ్చిన తరవాత, ఒక కుక్కపిల్ల దప్పిక వల్ల నాలుక చాచి తడి మన్నును తినడం గమనించాడు. దాని దురవస్థకు జాలిపడి బావిలోకి దిగాడు. తన చర్మపు మేజోడులో నీళ్ళు నింపి, నోటితో పట్టుకొని వెలుపలికి వచ్చి, కుక్కపిల్లకు ఆ నీరు తాగించాడు. అల్లాహ్ ఆ వ్యక్తి చేసిన పనికి ప్రసన్నుడయ్యారు.కనుక ఏ ప్రాణిపట్ల దయచూపి దాహార్తి తీర్చినా పుణ్యం కలుగుతుంది’.
జీవనావసరమైన నీటిని, కూర్చొని రెండు లేక మూడు గుక్కల్లో తాగాలి. జమ్ జమ్ పవిత్ర జలాన్ని మాత్రం నిలబడి కాబా గృహం వైపు తిరిగి దుఆ చేసుకొని తాగాలి.
నీటిని పవిత్రంగా, అల్లాహ్ కరుణగా భావించాలి. ఉపవాస దీక్ష విరమణ చేసే విశ్వాసులందరూ దాహం తీర్చుకొని అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేయాలి. చక్కటి వర్షాల కోసం, పవిత్ర రమదాన్ మాసంలో అందరం ప్రార్థిద్దాం!
- షేక్ బషీరున్నీసా బేగం
52 అమృత పుత్రులు
మనిషి ప్రేమించినప్పుడు, ఆ ప్రేమలో అనేక వాంఛలు ఉంటాయి. దివ్య ప్రేమ అనే సూర్యుడు మనో దిక్‌మండలంపై ప్రకాశించగానే, అన్ని పనుల భారాన్నీ భగవంతుడికే వదిలివేయాలి. అటువంటి ప్రేమ సాధించడం కష్టమే!
ప్రేమ మూడు రకాలుగా ఉంటుంది. తాను ఏమీ ఇవ్వకుండానే, ఎదుటి నుంచి కోరుతుండేది ఒక రకం. రెండోది- ‘నేను ప్రేమిస్తాను. దానికి బదులుగా నాకు ఏదైనా ఇవ్వు’ అనేది. అది వస్తుమారక పద్ధతి లాంటిది. మూడో రకమైన ప్రేమ, తిరిగి దేన్నీ ఆశించదు. ఆ ప్రేమలోనే భక్తులు లీనం కావాలి. ప్రేమే సర్వస్వంగా, అదే వారి తుది గమ్యంగా సాగాలి.
ఆ ప్రేమలో ఆత్మ ఒక కాంతిధారలా భగవంతుడి వైపు ప్రవహిస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, ధనమో పేరుప్రఖ్యాతులో కావాలని కోరుకునేంత వ్యవధి ఉండదు. భగవంతుడు తప్ప, భక్తుడిలో వేరే ఆలోచనే కలగదు. ఆ ప్రేమభరిత స్థితిలో అతడిలో ఓ అనంతమైన, అద్భుతమైన ఆనందం ఉద్భవిస్తుంది. నిరంతరమూ ప్రవహించే ప్రేమామృత ధార అది!
అన్నింటికంటే ప్రేమను తేలికగా పొందవచ్చు. దానికి తర్కంతో పని లేదు. ఎవరూ ఎటువంటి ప్రదర్శనా ఇవ్వనక్కర్లేదు. రుజువులు చూపించాల్సిన పని అసలే ఉండదు.
హేతువు వల్ల, మన బుద్ధి ప్రతిదాన్నీ పరిమితం చేస్తుంది. అప్పుడు మనం ఒక వల విసురుతాం. అందినదాన్ని పట్టుకుంటాం. అది అందరికీ కనిపిస్తుంది. భగవంతుడి ప్రేమ అంత సులువుగా దొరికేది కాదు. ఆ ప్రేమ- కాలానికి అతీతమైంది. అది నిరపేక్ష మాధుర్యం!
ఒక హంతకుడు తన పిల్లవాణ్ని ముద్దాడినప్పుడు, ఆ ఒక్కక్షణం అతడిలో ప్రేమే కనిపిస్తుంది. మిగతా అన్నింటినీ విస్మరిస్తాడు. అదీ ప్రేమ గొప్పతనం!
స్వార్థచింతన, అహంకారం, కోపతాపాలు, కామవికారాలు- అన్నింటినీ భగవదగ్నిలో సమిధల్ని చేయాలి. వాటిని అలా దగ్ధం చేస్తే, మిగిలేది ప్రేమే!
‘సృష్టి సమస్తం దైవమయమే! ఆ దైవం పులి రూపంలో ఉంటే, భక్తుడు విడనాడటం మంచిది. జలాల్లోనూ భగవంతుడున్నాడు. అలా అని భక్తుడు కాలుష్య జలం బారిన పడకూడదు’ అని శ్రీరామకృష్ణ పరమహంస హితవు పలికేవారు.
భగవంతుడికి తమను తాము అర్పణ చేసుకొన్న భక్తులు, ప్రపంచం కోసం మరింత ఎక్కువ కృషిచేస్తారు. వారంతా భగవంతుడి పట్ల భక్తిజ్వాలలో పునీతులైనవారు. వారు పాటించే పరిశుభ్రత, ఆచరించే నిశ్శబ్దం నుంచి దైవశక్తి సంబంధిత వాక్కు లభిస్తుంది. అలాంటి మహాభక్తుల సాన్నిధ్యం దొరకడం ఎవరికైనా చాలా కష్టం! భక్తితత్పరుల సమక్షంలో కొన్ని నిమిషాలు గడిపినా చాలు- జీవితమంతా పూర్తిగా మారిపోతుంది.
భగవంతుణ్ని ప్రేమించేవారి సన్నిధి, లేదా వారు ఉండే చోటు ఓ పవిత్ర మందిరంగా మారుతుంది. ఆ భక్తులూ భగవత్ స్వరూపులే! వారి పలుకులు వేదాల వంటివి. పరమభక్తుల మాటల మాధుర్యం వల్లనే, ఆ ప్రాంతం మరో బృందావనంగా శోభిల్లుతుంది. ఆ భక్తులు దైవశక్తి అనే దివ్యకాంతిలో మెరిసేవారు. ఆ దైవానికి వారే అమృతపుత్రులు!
- కె.యజ్ఞన్న
54 జీవిత పరమార్థం
జీవిత పరమార్థం
సుఖదుఃఖాలు, రాత్రింబవళ్లు, ఉదయాస్తమానాలు, శీతోష్ణాలు, చీకటి వెలుగులు, ఎండ-వానలు, శరీరం-ఆత్మలు, ధర్మాధర్మాలు, జనన మరణాలు, స్త్రీలు-పురుషులు అనే పడుగుపేకలతో కాలాత్ముడు ప్రకృతి వస్త్రాన్ని నేస్తాడు. ఈ ప్రకృతిలో చేతనాలు, అచేతనాలు (జీవులు, నిర్జీవులు) అనే ద్వంద్వాలు నిండి ఉన్నప్పుడు, ప్రకృతిలో భాగమైన మానవుడి జీవితంలో ద్వంద్వాలుండటం అసహజం కాదు.
జీవితంలో ద్వంద్వాలుండాలి. ఈ ద్వంద్వాలే మానవుణ్ని ఉత్తేజపరుస్తాయి. అతడికి ఆనందం అందిస్తుంటాయి. జీవితంలో ముందుకు సాగడానికి సహకరిస్తుంటాయి. కష్టాల నుంచి బయటపడినప్పుడే మానవుడు సుఖాన్ని అనుభవించగలడు. కష్టం ఎదురైందని ముందుకు వెళ్ళడం మానేస్తే, ఆ దరిమిలా వచ్చే సుఖాన్ని మానవుడు పొందలేడు. కష్టం తరవాతనే దాని జోడీ అయిన సుఖం వస్తుంది. చేదును రుచి చూశాకనే, తీపివస్తువులోని మాధుర్యం అనుభవానికి వస్తుంది. విరహం లేనిదే అనురాగంలోని అనిర్వచనీయ రుచి అర్థం కాదు. రాత్రి గడవనిదే, వెలుగు నిండిన పగలు రాదు. ద్వంద్వాలను అర్థం చేసుకొని, జీవితంలో ముందుకు సాగే ప్రయత్నమే మానవధర్మం అనిపించుకొంటుంది!
మానవ జీవితంలో శరీరం, బుద్ధి, మనసు అనే ముఖ్యమైన మూడు ఒకదానితో ఒకటి సంగమించాలని పెద్దలంటారు. ఈ మూడూ విడివడని లంకె వంటివి. వీటిని విడదీస్తే జీవితం లేదు. మూడింటి నుంచి బుద్ధిని విడదీస్తే, ఆ వ్యక్తిని మూర్ఖుడంటారు. మనసును పక్కన పెడితే, మనసు లేని ఆ వ్యక్తిని మానవత్వం లేని మొరటువాడని, కఠినాత్ముడని అంటారు. శరీరం లేనిదే జీవితం ఉండదు. అందుకే మానవుడు తన శరీరాన్ని కాపాడుకోవాలి.
అరిషడ్వర్గాల మీద విజయం సాధించడం మానవుడికి ఎంతో అవసరం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరుగురూ అంతశ్శత్రువులు. వీళ్ళు బయటికి కనిపించరు. లోపలే ఉండి మనిషిని దెబ్బతీస్తుంటారు. వీళ్లను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మానవ జీవితం సుగమంగా ముందుకు సాగిపోతుంది.
కష్టాల్లో, ఆపదల్లో ఉన్న ప్రాణుల్ని చూసి వాళ్ల స్థానంలో మనమే ఉన్నట్లు భావించాలి. అప్పుడే అంతశ్శత్రువులు అంతరిస్తారన్నది, అనుభవ సారాన్ని ఇముడ్చుకొన్న పెద్దలు చెప్పే విలువైన మాట.
గృహస్థ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే, మానవులు సమాజ ధర్మాన్నీ పాటించాలి. తమ సంతానం, తమ తల్లిదండ్రులు, తమ బంధుజనులు- కేవలం వీళ్ల శ్రేయస్సుకు పాటుపడటమే పరమావధి కాకుండా, ఇరుగుపొరుగుల బాగోగుల్నీ చూస్తుండాలి. తామరాకుపై నీటిబొట్టులా వ్యవహరించాలి. తన సంపాదనలో కొంత భాగాన్ని ఇతరుల కోసం కూడా వెచ్చిస్తుండాలి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, భగవంతుణ్ని సేవించాలి. గృహస్థ జీవితంలో అనురాగ వాత్సల్యాలతో పాటు భక్తి, సేవ, త్యాగం ఉన్నందువల్ల- ఆ జీవితాన్ని పెద్దలు తపస్సుతో పోల్చారు.
రుషులు, మునులు లోకకల్యాణం కాంక్షించి తపస్సు చేశారు. ఫలితంగా వారు దైవానికి దగ్గరయ్యారు. సామాన్య గృహస్థులు సైతం సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ సేవలు సాగిస్తే, వారికీ సత్ఫలితమే లభిస్తుందని పెద్దలంటారు. ఇంతకు మించిన పరమార్థం మానవ జీవితానికి మరొకటి ఉండదు!
- కాలిపు వీరభద్రుడు
Wednesday, June 29, 2016
దుఆ (ప్రార్థన)
83 దుఆ (ప్రార్థన)
మనిషి ప్రకృతిని ఆసరాగా చేసుకొంటాడు. భౌతిక అవసరాలు తీర్చుకుంటూ పెరిగేందుకు, బలంగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తాడు. నిజానికి, జీవన ఒడుదొడుకులు తట్టుకొనేందుకు, మనోవైకల్యాలు అధిగమించి సంపూర్ణ పరమార్థాన్ని సాధించేందుకు- ప్రతి నిమిషమూ ఆ సృష్టికర్తను ఆరాధించాలి. దుఆ చేస్తూ తనను తాను జ్ఞానిగా మలచుకోవాలి. ‘పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో దుఆ చేయండి. ఏమరుపాటుకు లోనై పరధ్యానంలో ఉంటూ చేసేవారి దుఆను అల్లాహ్ ఆమోదించడని తెలుసుకోండి. వినయ వినమ్రతలతో అమితమైన అణకువతో అల్లాహ్‌ను వేడుకోండి విలపిస్తూనూ...గోప్యంగానూ...’(ఖురాన్ 7:55)

ప్రార్థించే వ్యక్తి- పరిశుద్ధత పాటించాలి. కాబా గృహానికి అభిముఖంగా మోకాళ్ల వరకు ముడుచుకొని కూర్చొని, చేతులు భుజాల వరకు పైకెత్తాలి. ముందుగా తనకోసం, తరవాత తల్లిదండ్రుల కోసం, సోదరీ సోదరుల కోసం, యావత్తు సమాజం కోసం దుఆ చేయాలి. రాత్రి చివరి జాములో దైవకారుణ్యం మానవులపై ఉంటుంది. ప్రార్థించేందుకు అది చాలా మంచి సమయం. శుక్రవారం ఏ ఘడియలోనైనా దుఆ చేయవచ్చు. రమజాన్ మాసంలోని ఘనమైన రేయి లైలతుల్ ఖద్ర్‌లో చేసే దుఆ, ఖురాన్ పారాయణం తరవాత చేసే దుఆ, వర్షం కురిసేటప్పుడు చేసే దుఆలు సమ్మతమేనని దివ్య ఖురాన్ గ్రంథం తెలుపుతోంది.
తమ సంతానం కోసం తల్లిదండ్రులు చేసే దుఆ; బాధితులు, ప్రయాణికులు, విధేయులైన సంతానం చేసే దుఆ; ప్రజల కోసం న్యాయపరిపాలన చేసే రాజు దుఆ ఆమోదనీయమైనవి. అక్రమార్జనపరులు పవిత్ర మక్కాలోని కాబా గృహం వద్దకు చేరి ప్రార్థించినా అది అంగీకార యోగ్యం కాదు. నమ్మక ద్రోహిని, నిత్య పాపిని అల్లాహ్ ప్రేమించడు.
‘అల్లాహ్! దిగులు, దుఃఖం, బలహీనత, సోమరితనం, పిరికితనం, పిసినారితనం, రుణభారం, ఇతరులపై ఆధిక్యతా ప్రయత్నం నుంచి నేను నీ శరణు వేడుతున్నాను. నీవు నాకు చేసిన ఉపకారాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నీ దాసుడిని’ అని చేసే దుఆతో మానవుడి మనోవికారాలు అంతమొంది, సన్మార్గపు ద్వారాలు తెరుచుకుంటాయి.
‘ప్రభూ! నాకు దైవభీతిని, సచ్ఛీలతను, నిరాపేక్ష భావాన్ని ప్రసాదించాలని నిన్ను అర్థిస్తున్నాను. మా లెక్కలు తీసుకొనే రోజున- నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులందరినీ క్షమించు. పొరపాటున జరిగే మా తప్పులను ఎంచకు. మమ్మల్ని రక్షించు, కరుణించు. నీవు కనికరించేవాడివి. కరుణామయుడివి. నీ కృప వల్ల మేము జీవించి ఉన్నాం. నీ ఆదేశం మేరకు మరణిస్తాం. మేము నీ వైపే తిరిగిరావాల్సిన వాళ్లం’ అంటూ నిత్యం అల్లాహ్ ముందు ప్రార్థించినవారు రక్షణ పొందుతారు. అల్లాహ్ ప్రసాదిస్తే తప్ప శక్తి సామర్థ్యాలు మానవులకెక్కడివి? సర్వమూ ఎరిగినవాడు ఆ జగద్రక్షకుడు!
రమదాన్ మాసం విశ్వాసికి శిక్షణ వ్యవధి వంటిది. రానున్న పదకొండు నెలల్లో పైశాచికమైన షైతాన్ దుష్టప్రేరణలతో తలపడటానికి, ఇది శక్తిని సమీకరించుకొనే కాలం. విశ్వాసులు రమజాన్ చివరి పది రోజులు, రాత్రులు జాగరణ చేసి అధికోత్సాహంతో దైవారాధనలో నిమగ్నమవుతారు. ఇహ పర లోకాల్లో వరాలు కోరుతూ చేసే దుఆలతో మనుషుల మస్తిష్కం నుంచి పశుప్రవృత్తి, గర్వం, అహంకార భావాలు దూరమవుతాయి. ‘దుఆ విషయంలో విరక్తి చెందకండి. ఏమరుపాటుకు లోను కాకండి. దుఆ చేసేవాడు ఎన్నటికీ నాశనం కాడు’ అని ప్రియమైన ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) ప్రబోధించారు.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మన అత్యంత శ్రేష్ఠమైన రమదాన్ ఆరాధనలను, దుఆలను అంగీకరించి విశ్వశాంతి కలిగించుగాక. ఆమీన్.
- షేక్ బషీరున్నీసా బేగం
నాన్నకు జేజేలు

తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది. తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది. తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది. ‘పుత్ర శబ్దానికి- తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.
‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి. దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు. అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు. వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన శ్రవణ కుమారుడు... అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ప్రవరాఖ్యుడు... అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు... ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు. అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.
అమ్మను ఇంట్లో ఉంచుకుందాం దేనికైనా ‘పని’కొస్తుందని, అమ్మానాన్నలను విడదీసేవారికి ‘తల్లిదండ్రులు’ అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం. ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ, స్వభావరీత్యా ఏకవచనమే! కాబట్టే విగ్రహవాక్యం- ‘తల్లియును తండ్రియును’ అంటూ ఏకవచనంలో చెప్పాలంది వ్యాకరణ శాస్త్రం. ‘వారు ఇద్దరు కారు, ఒక్కరే’ అనే భావనను మనలో పెంపొందించడానికే- భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది.
కుటుంబ వ్యవస్థకు, గృహస్థుధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన నాలుగు మూల స్తంభాల్లో ‘మాతృదేవోభవ’ ‘పితృదేవోభవ’లను మొదటి రెండుగా చెబుతారు. వీటిలో అమ్మకు- పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక! ఇంటి వాకిటా వికాసాన్ని వెదజల్లే వీధిగడప దీపం నాన్నకు ప్రతీక! లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడంలో విచిత్రం ఏమీ లేదు. అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం!
అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ. నాన్న ప్రేమకు లోతెక్కువ. ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలూ ఒక్కటే అయినా- నాన్న అంత తొందరగా బయటపడడు కాబట్టి, అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం!
అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన. శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం.
బాల్యం నుంచి తాను పట్టి నడిపించిన చిటికెన వేలు, ఆ తరవాత తనకే కళ్ళజోడుగా మారి దారి చూపించడం నాన్నకు ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. అలా సంతానం తనకు చేతికర్రగా మారిన రోజున ‘ఆత్మావై పుత్రనామాసి’ (తానే భార్య గర్భాన పుత్రుడై జన్మిస్తాడు) అనే వేద వాక్యానికి తాత్పర్యం తండ్రికి ఎంతో ఆత్మీయంగా అనుభూతం అవుతుంది.
‘నాన్నల రోజు’న వారు ఆశించేది అపురూపమైన ఆ తీపి అనుభూతినే! తనయులు దాన్ని హృదయపూర్వకంగా తండ్రులకు అందించిన రోజున నాన్నల రోజు నిజంగా సార్థకం అవుతుంది. పితృరుణం తీరుతుంది. నిరంతరం పరుగులు తీసే కాల ధర్మం మూలాన- లోకంలో నాన్న లేకున్నా, ఆయననే మనసారా స్మరిద్దాం. ‘నాన్నకు జేజేలు’ పలుకుదాం!
- ఎర్రాప్రగడ రామకృష్ణ
ధైర్య వచనం
ధైర్య వచనం
‘ఈ మాత్రలు సక్రమంగా వాడండి. నాలుగు రోజుల్లో మీరు మామూలు పనులన్నీ చేసుకోవచ్చు...’ అని వైద్యుడు చెప్పగానే- రోగి పెదవులపై చిరునవ్వు వెలిగింది. ఉపాధ్యాయుడు ‘మీరంతా కష్టపడి చదివారు. పరీక్షలు బాగా రాస్తారు...’ అనగానే- తరగతి గదిలో, దిగులు పోగొట్టే చప్పట్లు మార్మోగాయి. ‘అత్తమామలు నిన్ను కన్నబిడ్డలా చూసుకుంటారు తల్లీ! ఈ మాట ఓ వారం తరవాత నువ్వే అంటావు’- తల్లి వూరడింపు కొత్తగా కాపురానికి వెళ్లే కుమార్తె బెంగను చాలావరకు తగ్గించింది. ‘నాన్నా! నలుగురు బిడ్డలున్నాం. పదవీ విరమణ చేసినా నీకు, అమ్మకు ఏ లోటూ రానివ్వం’- పెద్దకొడుకు హామీతో తండ్రి గుండె ఆనంద తరంగితమైంది. ఇవి ధైర్య వచనాలు. దైనందిన జీవితంలో ఇలాంటి సన్నివేశాలు వివిధ స్థాయి వ్యక్తుల్లో అసంఖ్యాకం. ఆప్తవాక్యం వూరటనిస్తుంది. ఆశ నింపుతుంది. కార్యానికి ప్రేరణ కలిగిస్తుంది.

‘ధైర్యం సర్వత్ర సాధకమ్’ ఆర్యోక్తి సర్వులకూ వర్తించినా, ధైర్యగుణాన్ని వశం చేసుకోవడం సులభసాధ్యం కాదు. దానికి సడలిపోయే లక్షణముంది. ధైర్యంతో మనసులో ఒక సంకల్పానికి బీజావాపనం కాగానే, దాని చుట్టూ ఎన్నో సంబంధిత అంశాలు పరిభ్రమిస్తాయి. సాధనోపాయాలు అన్వేషించేందుకు యత్నిస్తాయి. బుద్ధి వాటిని జల్లెడ పడుతుంది. చివరకు వివేకం ఒక నిర్ణయానికి వస్తుంది. ఈ క్రమంలో, ధైర్య పరిమాణంలో స్వల్పంగానైనా మార్పు రావడం సహజం. మన పురాణేతిహాసాలు ఇందుకు ఎన్నో తార్కాణాలు చూపాయి.
ధైర్య వచనాలు, ఆప్తవాక్యాలు, సహానుభూతులు, అనునయం, ప్రోత్సాహాలు, ఆప్యాయత, ఆత్మీయత, హితోపదేశాలు- ఇటువంటివి కష్ట నివారణను సందర్భోచితంగా సూచించాయి. రామాయణం యుద్ధకాండలో ఒక విలక్షణ ఉదాహరణ ఉంది. రావణుడితో భీకర సమరంలో అలసిన రాముడు చింతామగ్నుడై ఉన్నప్పుడు అగస్త్య మహర్షి సమీపిస్తాడు. ‘రామ మహాబాహూ!’ అని సంబోధించి ధైర్యోన్నతి వర్ధిల్లజేసి- జయకరం, చింతాశోకనాశం, పరమ మంగళప్రదమైన ‘ఆదిత్య హృదయం’ జపిస్తాడు. రావణుణ్ని సంహరించమని ఉపదేశిస్తాడు. రాముడు అది పాటించి రావణుణ్ని వధిస్తాడు. అదీ, ధైర్యవచన ప్రభావం.
ఒక కోణంలో దర్శిస్తే ‘భగవద్గీత’ సుదీర్ఘ ధైర్యవచన సమాహారంగా తోస్తుంది. కౌరవ, పాండవ సేనల మధ్య నిలిచిన అర్జునుడు ఎదురుగా ఉన్న దాయాదులు, ఆచార్యులు, బంధుగణాన్ని చూసి శోకతప్తుడవుతాడు. ‘గాండీవం జారిపోతున్నది. నిలబడలేకున్నాను. స్వజనాన్ని ఎలా చంపగలను’ అని కృష్ణుడితో తీవ్ర వేదన వ్యక్తంచేస్తాడు. కృష్ణుడు గీతాబోధనతో ధైర్య వచనాల ద్వారా సవ్యసాచిని సమరోన్ముఖుణ్ని చేయగలిగాడు.
ఇటువంటి హితోక్తులు, వూరడింపులు, నిర్భయ భాషణం వంటివి పూర్వం కంటే నేడు మరింత ఆవశ్యకం. కాలం ఎంతో మారింది. స్వార్థచింతన, ధనార్జనాపేక్ష, హింసాప్రవృత్తి పెరిగాయి. విదేశీ ఉద్యోగావకాశాలు అధికమై, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తరిగిపోయి, సంతానమున్నా వయోధికులు ఏకాకులవుతున్నారు. జీవనశైలిలో పలు మార్పులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పలకరింపు, ఆపన్న హస్తం, సానుభూతి వంటివి సహాయకారులవుతాయి. వేదన తగ్గిస్తాయి. ఆత్మవిశ్వాసం పెంచుతాయి. బాధల్ని కొంతైనా నివారిస్తాయి. ఆత్మహత్యల వంటి ఆవేశపూరిత చర్యలు తగ్గుతాయి. కుంగుబాటు నుంచి రక్షిస్తాయి. భయం అంతరిస్తుంది. ఆనందం మొలకెత్తుతుంది.
ఆర్తుల్ని ఆదుకునేందుకు కరుణ నిండిన హృదయం కావాలి. మన చుట్టూ ఎందరో ఆర్తులుంటారు. వారి బాధల్ని మాట సహాయం, మంచి పలకరింపుతో ఉపశమింపజేయవచ్చు. అది మనలో మానవీయత పెంచుతుంది. ఆర్తులకు సహాయం సకాలంలో అందుతుంది. అదే ధైర్యవచన ఫలితం.
- గోవిందరాజు రామకృష్ణారావు
జ్ఞాన క్షేత్రం
జ్ఞాన క్షేత్రం
‘జ్ఞానం ఎందుకు’ అనే ప్రశ్న అర్థం లేనిది. జ్ఞానమనేది ఓ దాహం, ఆర్తి. తీర్చుకుంటున్నకొద్దీ, అది ఇంకా పుడుతూనే ఉంటుంది. ఆ తపనను ఎవరూ ఆపలేరు.
మనిషి జ్ఞానంకోసం పుడతాడు. దాన్ని సంపాదిస్తాడు. ఆ జ్ఞానసాధనలోనే అతడి జీవితం నడుస్తుంది.
పుష్పాలు పరిమళాన్ని ఇస్తాయి. గాలి- ప్రాణంగా మారి మనిషిని నిలబెడుతుంది. ఆకాశం తన విశాలత్వాన్ని చాటుతుంటుంది. సమస్త ప్రకృతీ మనిషికి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే జ్ఞానం వేదమై, వెలుగై లోకంలో ప్రకాశిస్తుంటుంది.
శివుడు ఓ సందర్భంలో జ్ఞానగంగను కోరాడని పురాణాలు చెబుతాయి. అలాగే శ్రీరాముడు తన గురువు వసిష్ఠుడి వద్ద జ్ఞానం పొందాడు.
మనిషి అన్నం మరచిపోవచ్చు కానీ, జ్ఞానాన్ని మరవలేడు. మరవకూడదు. ఏది జ్ఞానం, అది ఎంతవరకు లభ్యమవుతుంది, దాని వల్ల ప్రయోజనం ఏమిటి అని అతడి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. తలుపులు తెరిస్తే, అసలైన జ్ఞానం దానికదే వచ్చి అతడి హృదయంలోకి చేరుతుంది. అదే శరీరానికి, మనసుకు, ఆత్మకు పుష్టినిస్తుంది.
పుస్తకాలతో లభించేది గొప్ప జ్ఞానం. ప్రకృతి నేర్పించేది- సహజమైన జ్ఞానం. జీవితం వల్ల కలిగేది, మనిషికి అన్నింటికంటే ముఖ్యమైనది అనుభూతిపరమైన జ్ఞానం. అది సూటిగా సరళంగా అతడి హృదయాన్ని తాకుతుంది. క్షణంలో ఎంతో మార్పుతెస్తుంది.
లోపలి జ్ఞానం వల్ల, మనసే మారిపోతుంది. మనిషి ఎదుట కొత్త దారులు తెరుచుకుంటాయి. యోగ రహస్యాలు తెలుస్తాయి. అతడిలో అప్పటివరకు నిక్షిప్తమై, అతడికే తెలియకుండా ఉన్న దివ్యత్వం అప్పుడు విప్పారుతుంది. నలువైపులా గుబాళిస్తుంది. ఆ బతుకు నందనవనంగా రూపొందుతుంది. జ్ఞానం కలగడం వల్ల, అప్పటిదాకా మృగంలా ఉన్న మనిషైనా నరుడవుతాడు. ఆ నరుడే నరోత్తముడిగా మారతాడు. నరోత్తముడు నారాయణుడిగా వెలుగుతాడు. అదంతా జ్ఞానఫలితమేనని స్వామి వివేకానంద అనేకమార్లు విశదీకరించారు.
పూర్ణజ్ఞానం పొందినవారు విలక్షణంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా రూపొందుతారు. జీవితం నుంచి ఏం పొందాలో కచ్చితంగా తెలుసుకుంటారు. వారు దార్శనికులు. లోకాన్ని దివ్యపథం వైపు నడిపించేది వారే. ఆ కృషిలో రాజ్యపూజ్యం లభించినా, ఒక్కోసారి అవమానం ఎదురైనా వారు చలించరు. ఆ రెండింటినీ సమంగా పరిగణించే స్థితప్రజ్ఞులు వారు!
ఇంత తిని, ఎంతో కొంత పనిచేసి, నిద్రించడమే జీవితగమ్యం అనుకునే స్థితి నుంచి మనిషిని వేరుచేసేది- జ్ఞానమే. సాధారణ ప్రాణికి, దివ్యమైన యోగికి ఉండే తేడాలు రెండు. ఒకటి జ్ఞానం, రెండోది బుద్ధి. వీటిని విస్మరించిననాడు మానవుడికి మనుగడే ఉండదు.
విశ్వం విస్తరిస్తోంది. అంతటా ప్రగతి కనిపిస్తోంది. అంతరిక్షమూ అనేక అవకాశాలు చూపిస్తోంది. అలాగే సరైన జ్ఞానం సంపాదించుకున్న నరుడే అందరికీ అన్నింటినీ సమకూర్చగలడు. ఆ మరో ప్రపంచం కోసమే ప్రతి ఒక్కరూ కలలు కనాలి. వాటికి మూలాధారం- జ్ఞానం. పూర్వం రుషులకు అటువంటి జ్ఞాన సంపదే ఉండేదని ఇతిహాసాలు చెబుతాయి.
కురుక్షేత్రంలో మొదట అర్జునుణ్ని విషాదం ఆవరించింది. శ్రీకృష్ణుడి ఎదుట చాలాసేపు అతడు అదే విషాదయోగంలో ఉన్నాడు. కురు సోదరులు, బంధుమిత్రులు, గురువులతో యుద్ధం చేయనన్నాడు. ఆ మాటలన్నీ విన్న కృష్ణుడు చివరికి జ్ఞానం అనే బాణం ప్రయోగించాడు. అదే అర్జునుడిలో శక్తిని నింపింది. అప్పుడు అతడు మహావీరుడిలా లేచి నిలుచున్నాడు. ఆ వెంటనే జ్ఞానానికి నమస్కరించాడు. విశ్వరూపమే ఆ జ్ఞానం!
యుద్ధం సాగింది. ‘చేసేది నీవు, చేయించేది నేను’ అంటూ అర్జునుణ్ని ముందుకు నడిపించాడు కృష్ణుడు. యుద్ధంలో గెలిపించాడు. ఎప్పటికైనా జ్ఞానక్షేత్రమే గొప్పదని ఆ కురుక్షేత్రంలో రుజువు చేశాడాయన!
- ఆనందసాయి స్వామి
ఎక్కువ తక్కువలు
అంతర్యామి
ఎక్కువ తక్కువలు
లోకంలో కొందర్ని అల్పులుగా, మరికొందర్ని అధికులుగా భావించడం తగదు. అల్పత్వం, ఆధిక్యం అనేవి ఏదో ఒక వర్గానికి లేదా ధనానికి సంబంధించినవి కావు. అది గ్రహించకుండా- మనిషి పుట్టుక, సిరిసంపదలు, విద్యార్హతలు, చేసే వృత్తిఉద్యోగాల్ని బట్టి ఆధిక్యాన్ని ఆపాదించడం సరికాదు.
ఏ వృత్తీ అల్పమైనది కాదు. కొన్ని వృత్తుల్ని పవిత్రమైనవిగా, మరికొన్నింటిని అందుకు విరుద్ధంగా భావించడం పొరపాటు. చిత్తశుద్ధి కనబరుస్తూ, స్వార్థరహితంగా వ్యవహరిస్తూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడే ప్రతివాడూ ఉత్తముడే!
పరిపాలనకు సంబంధించి, దిగువస్థాయి ఉద్యోగులు మరింత కీలకమైనవారు. వారి పనితీరుపై ఆధారపడి ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. విజేతలుగా పేరు గడించిన రాజులు సైతం, యుద్ధంలో ‘విజయమో వీరస్వర్గమో’ అంటూ పోరాటం సాగించిన సాధారణ సైనికుల వల్లనే చరిత్రకెక్కారు.
భారీయంత్రానికి సైతం కీలకమైన చోట్ల చిన్నపాటి మరలు అవసరమవుతాయి. పొలంలో అహర్నిశలూ శ్రమించి పండించే సన్నకారు రైతు, చెప్పులు కుట్టే వ్యక్తి, పారిశుద్ధ్య కార్మికుడు, భవన నిర్మాణపనిలో రాళ్లెత్తే కష్టజీవి- వీరిలో ఎవరూ తక్కువవారు కారు. కర్మాగారంలో చెమట చిందించే శ్రామికుడు, దుస్తులు నేసే వ్యక్తి- ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. పెద్దపెద్ద చదువులు చదవకపోవచ్చు కానీ, వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో ప్రతి ఒక్కటీ సమాజానికి అత్యవసరమైనదే. ఆయా పనుల్ని వారు ఎంత బాగా, నేర్పుగా చేస్తున్నారన్నదే ముఖ్యం.
అల్ప వస్తువులు, అల్ప మానవులు అని ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు. అలా హీనంగా చూడటం విజ్ఞుల లక్షణం కానే కాదు.
ఎవరికైనా బుద్ధిబలమే ముఖ్యం. ఆ బలంతో ఎంతటి పనినైనా సులువుగా సాధించవచ్చు. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ అన్నారు నీతిశతక కర్త. మదపుటేనుగును గడ్డిపరకలు కలిసి బంధిస్తాయనడంలోనూ ఉమ్మడిశక్తి ప్రాధాన్యం స్పష్టమవుతుంది. యుక్తిచాతుర్యంతో ఎంత చిన్న ప్రాణులైనా గెలుపు సాధిస్తాయనేందుకు ‘నీతిచంద్రిక’లోని ‘సింహం-కుందేలు’ ఉదంతమే ఉదాహరణ. ఉపాయంతో అపాయం తప్పుతుందని ఆ కథ నిరూపిస్తుంది.
పరాక్రమవంతుడైన శ్రీరాముడికి వానర సేన సాయం కావాల్సి వచ్చింది. రాళ్లతో వారధి కట్టి సముద్రం దాటి వెళ్లిన ఆ సైన్యమే, రాక్షసుల్ని గడగడలాడించింది.
అల్పంగా కనిపించినా, ఆ శక్తి ఎప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుందో ఎవరికీ తెలియదు. లోకంలో కొందరు తామే పండితులమని, తమకు తెలియనిది ఏదీ ఉండదని మిడిసిపడుతుంటారు. విద్య, విజ్ఞానం ఏ ఒక్కరి గుత్తసొత్తు కాదు. తెలివి ఎవరి హక్కుభుక్తమూ కాదు. ఎంతటివారికైనా తెలియనివి, చేతకానివి కొన్ని ఉంటాయి.
ఒక మహా విద్వాంసుడు పడవలో ఏరు దాటుతున్నాడు. ఆ పడవ నడిపే వ్యక్తిని చూసి, అతడికి ఎటువంటి చదువూ లేదని జాలిపడ్డాడు. అది అహంకారానికి దారితీసిన స్థితిలో, కేవలం తనకే సమస్త శాస్త్రాలూ తెలుసునన్నట్లు మాట్లాడాడు. అంతలో తుపాను వచ్చింది. పడవ మునిగిపోతుందనే భయం ఆ పండితుడికి కలిగింది.
పడవ నడిపేవాడు ‘నాకు ఈత వచ్చు కాబట్టి, ఈ నీళ్లలోకి దూకి ఎలాగో తీరం చేరుకుంటాను. మీకూ ఈత వచ్చు కదా’ అని ఆ పండితుణ్ని అడిగాడు. ఆయన గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు!
భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. అందుకే ఎవర్నీ హీనంగా చూడకూడదు.
పొలంలోని మట్టిలో ఉండే వానపాములు రైతులకు నేస్తాలు. అలాగే పట్టుపురుగులు, తేనెటీగల వంటి అల్పప్రాణులు, క్రిమికీటకాలు సైతం మానవులకు మేలు చేస్తున్నాయి. మనిషి సుఖసంతోషాలతో మనుగడ సాగించడానికి, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరి సహకారమూ అవసరమే. అది తెలుసుకొనేందుకు కనీసం ప్రయత్నించకపోవడం, లోకంలో ఎక్కువ తక్కువ భావాలతో వ్యవహరించడం- సంకుచిత స్వభావాన్ని బయటపెడతాయి. వాటి నుంచి మనిషి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది!
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
శ్రేష్ఠ జీవనం
శ్రేష్ఠ జీవనం అంతర్యామి
ఆకాశ లక్ష్మికి బొట్టు పెట్టినట్లుగా ఉంటుంది ఉదయించే ఎర్రని సూర్యబింబం. రోజూ చూసే సూర్యోదయమే అయినా, అది నిత్య నూతనంగా దర్శనమిస్తుంది. వెలుగుకు, స్వచ్ఛతకు సంకేతమది. మేఘం నుంచి నేలకు జారిపడే వానచినుకు, విత్తనాన్ని చీల్చుకుని భూమిపైకి వచ్చే లేతఅంకురాలు, చిగురాకు దళాలు, కురిసే మంచు, హిమశిఖరాలు, వీచే గాలి, జలప్రవాహం, పచ్చని ప్రకృతి- అన్నీ స్వచ్ఛతకు ప్రతిరూపాలు. మాతృగర్భం నుంచి భూమిపై పడిన శిశువుకు స్వాతిముత్యమే సరిపోలిక!
విశ్వంలోని ప్రతిదీ స్వచ్ఛత కలిగి ఉంది. విశ్వకుటుంబంలోని అద్భుతం మానవుడే! అందువల్ల అతడు స్వచ్ఛతకు ప్రతిరూపంగా ఉండి, శ్రేష్ఠమైన జీవనం గడపాలి. అటువంటి జీవితం స్వచ్ఛమైన ఆలోచనల వల్ల సాధ్యపడుతుంది. మానవ జీవనశైలిని, వెలుపలి ప్రపంచాన్ని ప్రభావితం చేసేవి స్వచ్ఛమైన ఆలోచనలే! అవి కొరవడితే- ప్రపంచం భయపెట్టేదిగా, అలజడికి నెలవుగా, నరకంలా తోస్తుంది.
స్వచ్ఛమైన ఆలోచనలంటే ఏమిటి? మనకు ముందుగా మనసులో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆపై దాని తాలూకు ఆలోచనలు పురివిప్పుతాయి. ఎప్పుడైనా అభిప్రాయాలు, ఆలోచనలు మంచి గంధంలా గుబాళించాలి. ద్వేషం, అహంకారం, అసూయ, పేరాశ, కామక్రోధాలు వంటి కాలుష్యాలు ఆలోచనల్లో ఉండకూడదు. ఎందుకంటే, ఆలోచన శక్తిమంతమైంది. చినుకుగా మొదలై, వర్షంగా మారి, తుపానుగా విజృంభిస్తుంది. చెప్పుచేతల్లో ఉండాల్సింది మనసు. పూర్ణ ఆయుఃకాలంతో ఆరోగ్యంగా కొనసాగాల్సింది శరీరం. కాలుష్యాలు ఈ రెండింటినీ గాడి తప్పేలా చేస్తాయి. ఒక్క విష బిందువు చాలు, కుండెడు పాలను విషతుల్యం చేయడానికి! అది పెను ఉత్పాతాలనే సృష్టిస్తుంది. వెలుపలి ప్రపంచాన్ని రణరంగంగా మార్చేస్తుంది.
కౌసల్య నందనుడైన శ్రీరాముణ్ని, కన్నతల్లి కంటే ప్రాణాధికంగా ప్రేమించింది కైక. ఆమె పుట్టింటి దాసి- మంథర. ఆమె దురాలోచన దుర్బోధగా మారి, స్వచ్ఛమైన కైక మనసును కలుషితం చేసింది. ఫలితంగా శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. దశరథుడు అసువులు బాయాల్సి వచ్చింది. మహాభారతంలో శకుని మాయాజూదం- కుట్రలు, కుతంత్రాలతో నడిచింది. అతడి దురాలోచన ఫలితం కురుక్షేత్ర సంగ్రామాన్నే సృష్టించింది. దుర్యోధనాదుల పక్షాన ఉంటూ, వాళ్ల వినాశనాన్నే కోరినవాడు శకుని.
వాటినుంచి నేర్వాల్సిన గుణపాఠం ఏమిటి? కాలుష్యాలకు అడ్డుకట్ట వేసుకోవాలి. ఇదే గొప్ప సాధన. ఆధ్యాత్మిక జగత్తులో స్వచ్ఛమైన ఆలోచనా సంవిధానాన్ని ‘సత్వగుణం’గా చెబుతారు. ఇది ఉత్తమమైన గుణం.
‘ప్రత్యేకమైన, శుద్ధమైన జీవనశైలి అంటే- సదాలోచనల ఆచరణే... పెదవి దాటి వచ్చే మాటను ఆలోచించి మాట్లాడటమే!’ అనేవారు స్వామి వివేకానంద. మనకు వేరేచోట దొరకని ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసం- దేవాలయాల్లో, ఇతర ప్రార్థనా మందిరాల్లో, సత్సంగాల్లో ఎలా లభిస్తున్నాయి? అక్కడ స్వచ్ఛమైన భావనలు, ఆలోచనల స్రవంతి రాజ్యమేలడమే కారణం. ఆలోచనా శక్తితరంగాల ప్రసారమది! స్వచ్ఛమైన ఆలోచనలు సత్కర్మలను ప్రేరేపిస్తాయి. రుజుమార్గ వర్తన, శీలసంపద వీటివల్లనే సాధ్యపడతాయి. చేసే పనుల ఫలితాలు మెరుగ్గా ఉండాలంటే, మన ఆలోచనా విధానాలు బాగుండాలి. ఒత్తిళ్లను తొలగించి, మనోశక్తిని కలిగించేవి స్వచ్ఛమైన ఆలోచనలు, ఆచరణలే!
విద్య బోధించడానికి ముందే, గురువు చక్కని నడవడిక కలిగి ఉండాలన్నది శ్రీచైతన్యులవారి దివ్య ప్రబోధం. గురుపీఠాన్ని అలంకరించేవారికి ఉండాల్సిన ముందు చూపు అది. మంచి ఆలోచనల వల్ల ఏర్పడే శ్రేష్ఠమైన జీవనం, పూర్ణ ఆయుఃప్రమాణం కలిగి ఉంటుంది. బలం, ఆరోగ్యం, ఆనందం, తృప్తి కలుగుతాయి. ఈ నాలుగూ జీవనసౌధానికి స్తంభాల వంటివి. రమణీయమైన శిల్పాన్ని, శిల నుంచి శిల్పి ఎలా మలిచాడు? శిల్పం తయారయ్యేందుకు వీలుగా, అతడు అనవసరమైన రాతి భాగాలను తొలగించాడు. జీవనశిల్పం అందంగా తయారయ్యేందుకు, కలుషితాలను మన మనసుల నుంచి దూరం చేసుకోవాలి. స్వచ్ఛతకు నిలువెత్తు నిదర్శనంగా ప్రతి మానవుడూ మెలగాలి!
- దానం శివప్రసాదరావు

విదుర నీతి (Vidura Neethi)
విదుర నీతి అంతర్యామి బుధవారం, జూన్ 29, 2016
మహాభారతంలో విదురుడు మహానీతిమంతుడు. యమధర్మరాజు అంశలో ఆయన- వేదవ్యాసుడికి, కురురాజు అంతఃపురంలోని పరిశ్రమి అనే దాసికి జన్మించాడు. భారతంలో కురువంశీయుల జన్మ వివరాలు వింతగా అగుపిస్తాయి. విదురుడు ధృతరాష్ట్రుడికి సవతి తమ్ముడు. ఇతడికి కురు వంశ పితామహుడైన దేవవ్రతుడు (భీష్ముడు) విద్యాబుద్ధులు నేర్పించాడు.
పాండవులకు కౌరవులు చేసిన అన్యాయాలకు విదురుడు ప్రత్యక్షసాక్షి. అన్యాయం సహించని నైజం ఆయనది. ఎవరితోనూ శత్రుత్వం ఉండరాదన్నది ఆయన నీతి. వైరం లేకుండా జీవించడం ఒక సాధన. విదురుడికి, అక్రూరుడికి, ధర్మరాజుకు శత్రువులే లేరు.
విదురుడు సుయోధనుడి దుష్టత్వాన్ని సహిస్తూనే మిత్రుడిగా జీవించాడు. శిష్టుడైన శ్రీకృష్ణుడితోనూ అంతే స్నేహం ప్రదర్శించాడు. పాండవ పక్షపాతి అని భావించిన కౌరవులు సైతం విదురుణ్ని భక్తిపూర్వకంగా ‘విదుర దేవా!’ అని సంబోధించేవారు.
ఆయన మహావీరుడు. యుద్ధవిద్యలన్నీ తెలుసు. మహారథి అయినా భారతయుద్ధంలో ఎవరి పక్షమూ వహించలేదు. ధృతరాష్ట్రుడు ఆయన పట్ల అసహనం ప్రదర్శించేవాడు. కొన్నిసార్లు అది క్రోధంగా మారేది. విదురుడు మాత్రం ధృతరాష్ట్రుడితో, ఆయన నూరుగురు కొడుకులతో స్నేహంగానే మెలిగేవాడు. ఎప్పుడూ ధర్మాన్నే అనుసరించాడు. తామరాకుపై నీటిబొట్టులా ఉండేవాడు. ఎవరి మనసునూ నొప్పించేవాడు కాదు.
జీవిస్తే విదురుడిలా, తనువు చాలిస్తే సరయూ నది నుంచి నేరుగా వైకుంఠం చేరిన శ్రీరాముడిలా ఉండాలన్నది అక్రూరుడి మాట. బలవంతులతో విరోధం మంచిది కాదని విదురుడు చాలాసార్లు దుర్యోధనుడికి హితవు పలికాడు. ఆయన మంచిని తాను సాధన చేసి ఇతరులకు చెప్పిన మాన్యుడు. దుర్యోధన, దుశ్శాసన, కర్ణులు మనిషిలోని తాపత్రయాలకు గుర్తులని పలు మార్లు ధృతరాష్ట్రుడికి చెప్పేవాడు. శకుని వల్ల మాయాజూదంలో ఓడిన ధర్మరాజుకు- సాత్విక స్వభావం, నిశ్చల ధర్మస్థితి గల పురుషుడు ఎన్నడూ వంచితుడు కాడంటూ నిష్ఠుర సత్యాలు బోధించాడు. కష్టాల్లో ధైర్యంగా ఉన్న వ్యక్తినే విజయం వరిస్తుందని విదురుడు చెప్పిన మాటలు- ధర్మరాజుకు సాంత్వన కలిగించాయి.
ఆదరిస్తే ఆనందం, అనాదరణకు గురైతే కోపం పొందేవారు ఏమీ సాధించలేరు. అవమానాలను వ్యక్తం చేయకుండా, ఆ స్థితినే విజయానికి మెట్టుగా భావించడం ద్వారా శత్రువును జయించాలన్నది విదుర బోధ. శకునికి ఈ విషయాన్ని ఆయనే రహస్యంగా బోధించాడని రాజాజీ ‘మహాభారతం’ వెల్లడిస్తోంది.
తీవ్రమైన మనోరథం కలిగినవారు మూర్ఖులేనని ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ సందర్భంలో విదురుడు దుశ్శాసనుడికి చెబుతాడు. దుశ్శాసనుడు మూర్ఖత్వం చూపించి, దుర్యోధనుడి ఆజ్ఞలను అనాలోచితంగా పాటించి పతనమయ్యాడు.
శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్లినప్పుడు, విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన మాటలు అమూల్యమైనవి. ‘మహావీరుడి ధనుస్సు నుంచి వెలువడిన బాణం ఎప్పుడైనా గురి తప్పడం వల్ల శత్రువును బాధించకపోవచ్చు... కానీ, మహానుభావుడి పలుకులు గురి తప్పవు. జీవరాశులన్నింటితో పాటు భూమినీ అవి నాశనం చేయగలవు’ అన్నది ఆయన హితోక్తి.
నూరుగురు కౌరవుల దురాగతాలను ధర్మరాజు క్షమించాడు. ఆ వ్యక్తిత్వాన్నే విదురుడు ఉదాహరిస్తూ- ‘సుయోధనా! క్షమను అసమర్థతగా భావించకూడదు. క్షమించడం కంటే బలమైన అస్త్రం లేదు. సమర్థుడి క్షమ- సమయం ఆసన్నమైనప్పుడు భూమిని సైతం నశింపజేయగల శక్తిగా పరిణమిస్తుంది. ధర్మరాజుతో కయ్యం, సర్పంతో నెయ్యం ప్రమాదకరం’ అని హెచ్చరించాడు.
కుటుంబంలో ఎవరూ లేని వ్యక్తిని, విపత్తుల్లో పడిన స్నేహితుణ్ని, దారిద్య్రం వల్ల ఆకలితో అలమటిస్తున్న శత్రువును, సంతానం లేని సోదరిని అక్కున చేర్చుకొని ఆశ్రయమివ్వాలని విదురుడు చెప్పేవాడు. ఆయన నీతిసూత్రాలు ఎవరికైనా ఆచరణీయాలే!
- అప్పరుసు రమాకాంతరావు

Monday, June 27, 2016
శాంతి మంత్రం
శాంతి మంత్రం అంతర్యామి మంగళవారం, జూన్ 28, 2016
ప్రతి మనిషీ శాంతిని కోరుకుంటాడు. విడ్డూరంగా ఎన్నోసార్లు అతడే అశాంతికి కారణమవుతుంటాడు. శాంతికి, అశాంతికి నెలవు మనసే! ఏ పూజలూ చెయ్యకపోయినా మనసును స్వచ్ఛంగా ఉంచుకుంటే చాలు. ప్రశాంతత మనలో నెలకొంటుంది. ఎవరికీ కీడు కోరకపోవడమే స్వచ్ఛత. అందరి మేలూ కోరడమే పవిత్రత.
మొదట మనం స్వచ్ఛత కోసం కృషిచెయ్యాలి. ఆ తరవాత వచ్చే రెండో అంచె చాలామంది విషయంలో క్లిష్టతరమైంది. సాధారణంగా మన కంటే ఎవరూ అధికులుగా ఉండరాదన్న బలమైన భావనే అశాంతికి బీజాలు వేస్తుంది.
కొంతమంది పైకి నవ్వుతూనే మాట్లాడతారు. లోపల అసూయ తొలిచేస్తుంటుంది. ప్రపంచ రంగస్థలం మీద మనకు ఎందరో నటులు తారసపడతారు. వారి మనసులో కాలుష్యం పేరుకుపోతూ ఉంటుంది. మనోకాలుష్యం శాంతిని, ఆరోగ్యాన్ని హరించి వేస్తుంటుంది. భారతీయ ఆధ్యాత్మికత గొప్పదనం ఏమిటంటే- ఏ రోజుకారోజు మనోమాలిన్యాలను తొలగించుకోగలిగే అనేక ప్రక్రియలను అది అందించింది. ఎవరి స్థాయికి తగినట్లు వారికి ఈ ప్రక్రియలు ఉపకరిస్తాయి. త్రికాల సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, దైవ ఆరాధన, దేవాలయ దర్శనం, ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, వేదాంత చర్చలు, ధ్యానం... దేని ప్రాధాన్యం దానిదే!
ధర్మం అంటే మతం అనే అపార్థం మదిలో నాటుకుపోయాక, మానవ సమాజం స్వార్థంగా సంకుచితంగా ఆలోచించడం మొదలైంది. మనిషితనానికి కాక మతవ్యాప్తికి ప్రాధాన్యమిస్తున్నారు. మానవత్వ ప్రాముఖ్యాన్ని మరచిపోతున్నారు.
దేవుడికి ఎవరి నిర్వచనాలు వారు చెబుతున్నారు కాని, ఆయన ఏ మతానికీ బద్ధుడు కాడు. మతంగా వ్యవహరించేది కేవలం ఒక మార్గం. అన్ని దారులూ దేవుడి దగ్గరకే అయినప్పుడు, ఎక్కువ తక్కువ అనేవి అర్థరహితాలు.
‘సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’. కేశవుడు, యెహోవా, అల్లా- పేర్ల మార్పే తప్ప అన్ని ఆరాధనల్నీ స్వీకరించేవాడు ఒక్కడే. కబీరు, గురునానక్ వంటి మహనీయులు పదేపదే ఈ సత్యాన్ని బోధించారు. కానీ, అవి చెవులు దాటి మనిషి మనసులో స్థిరపడనందువల్లే మత సంఘర్షణలు తలెత్తుతున్నాయి. ఆ ఘర్షణలు మారణహోమాలకు కారణంగా మారుతుంటే- కరుణామయుడు, సర్వ ప్రాణపిత, సర్వేశ్వరుడు ఆమోదిస్తాడా?
మానవత్వం లేనిది మతం కానే కాదు. కసాయిలు, హంతకులు దైవకృపకు పాత్రులు కాలేరు. వారి పూజలు, ప్రార్థనలు, ఆరాధనలను భగవంతుడు స్వీకరించడు.
మన పూజలన్నీ కోరికల జాబితాలే. మన మనసులన్నీ ఆశల శిఖరాలే.
ఇవి రెండూ- మనకు, భగవంతుడికి మధ్య అడ్డుగోడలవుతున్నాయి. అందువల్ల, దైవానుగ్రహం ఎందరికో అందని ద్రాక్షగా మిగిలిపోతోంది.
సనాతన ధర్మంలో ఎలాంటి దైవకార్యం చేసినా, శాంతి మంత్రాలతో ముగిస్తారు. ఇది అనాది నుంచి ఉన్న విధానం. అందుకు ఒక కారణం ఉంది.
ప్రకృతిలోని ఓషధులు (వనస్పతులు), పంచభూతాలు, గిరులు, సిరులు పండించే నదులు- నిత్యమూ అనేక కాలుష్యాల బారిన పడుతుంటాయి.
మంత్రాలు భావమయ ప్రకంపనలు. ఆచరణకు ప్రేరణలు. ఆకాంక్షలూ అంతే. ‘లోకాస్సమస్తా సుఖినోభవంతు’, ‘సర్వేజనా స్సుఖినో భవంతు’- వీటిని పెదవుల నుంచి గాక ఆత్మసాక్షిగా మనస్ఫూర్తిగా పలికితే, ప్రకృతి శక్తులు పరిశుద్ధమై ప్రసన్నమవుతాయన్నది పెద్దల మాట. ఈ భావన ఆచరణ రూపం దాల్చిన నాడు అందరూ ప్రకృతికి మిత్రులే, శాంతి దూతలే.
‘అందరూ బాగుండాలి’ అని నిజాయతీగా కోరుకునే వ్యక్తి ఎవరికీ అపకారం చెయ్యలేడు. చేతనైనంత మేరకు ఉపకారమే చేస్తాడు.
‘మన ఏవ మంత్రమ్’ గనుక పదేపదే ఇలా అనుకుని ఆచరిస్తే- అదే, శాంతి మంత్రం!
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్

ఎరుకతో ధ్యానం
‘విలువలతో చక్కగా జీవించే మనిషికి ఉనికి మొదటిస్థానం, హృదయం రెండోస్థానం, మనసు మూడోస్థానంలో ఉంటాయి’ అని ప్రసిద్ధ తత్వవేత్త ఓషో అనేవారు. హృదయం స్పందిస్తుంది. మనసు ప్రతిస్పందిస్తుంది. ఉనికి గమనిస్తుంది. కేవలం ‘గమనించడం’ మాత్రమే తెలిసిన ఏకైక గుణం ఉనికిది. ‘గమనించడం’ అంటే చూడటమే! కాని, చూడటంకన్నా ‘గమనించడం’ ఉన్నతమైంది. ‘గమనించడంలో- చూడటం, వినడం రెండూ ఉంటాయి’ అని అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి!
పశుపక్ష్యాదులు ఎప్పుడూ గమనింపుతో జీవిస్తాయి. అందుకనే అవి ఎరుకతో ఉంటాయి. ఫలితంగా, రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఎన్నో తెలివితేటలున్న మనిషి మాత్రం ప్రమాదాల బారిన పడుతుంటాడు. కారణం, అనవసరమైన ఆలోచనల వలలో అతడు చిక్కుకోవడంవల్లే! అంటే, పరధ్యానంలో పడటమన్నమాట.
ప్రస్తుత క్షణాల్లో ఉండకుండా గతానికి సంబంధించిన ఆలోచనలతో గడపడమే పరధ్యానమంటే! మనిషి పరధ్యానంలో ఉంటే ఎరుక తప్పుతాడు. అప్పుడు సమస్యలు కాకుల్లా వచ్చి అతడిపై వాలతాయి. మనిషి ఆలోచనలతో ఉన్నంతవరకు, మనసు బయట సంచరిస్తూ ఉంటుంది. అదే మనిషి ఒక పనిలో నిమగ్నమైతే ఆ వెంటనే మనసు నిశ్చలమవుతుంది. అప్పుడది లోపలికి చూస్తుంది. చేపట్టిన పనికి కావాల్సిన జ్ఞానం అంతశ్చేతనలో నుంచి తీసి ఇస్తుంది.
మనసు సముద్రగర్భం వంటిది. సముద్రం లోపల అప్పుడప్పుడూ హిమ ఖండాలు(ఐస్‌బర్గ్స్) తయారవుతాయి. అవి పర్వతాల్లా పరచుకొని పెరుగుతాయి. పైకిమాత్రం కొనతేలి చిన్న మంచుముక్కలా కనబడతాయి. వాటిని సరిగ్గా గమనించకపోతే సముద్ర ప్రయాణికులు ఆపదల్లో చిక్కుకున్నట్లే! మనిషికి వచ్చే వ్యాధులూ హిమ ఖండాల్లా మనసు లోతుల్లో ప్రాణం పోసుకుంటాయి. తదుపరి మనసులోపలే పర్వతాల్లా పెద్దగా అవుతాయి. ఆ తరవాత శరీరాన్ని తాకుతాయి. అంటే, ముదిరిన తరవాత వ్యాధి బయటపడటమన్న మాట! అప్పుడుగాని మనిషి తనకు జబ్బు చేసిందని గ్రహించడు. ఇలా ఎందుకు జరుగుతుంది? మానసిక స్థిరత్వం లేకపోవడం వల్లే! ఎప్పుడైతే మనసు నిలకడగా ఉండదో అప్పుడు ఎరుక ఉండదు. ఎరుక లేనప్పుడు తన ఉనికిపట్ల స్పృహ ఉండదు. అంటే తనతోతాను ఉండనప్పుడు, తన శరీరం లోపల ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉండటం అన్నమాట!
రాత్రిపూట ఇంట్లో హఠాత్తుగా దీపాలు ఆరిపోతే ఏమవుతుంది? ఆ చిమ్మచీకట్లో ఎవరికీ ఏమీ కనపడదు. అప్పటివరకూ ఏవేవో పనులు చేసుకుంటున్న మనసు ఆ క్షణంలో నిశ్శబ్ధమై పోతుంది. అప్పుడు మనిషి ఉనికి అతడి స్పృహలోకి వస్తుంది. ఎరుక మేల్కొంటుంది. చీకట్లో కొవ్వొత్తి కోసం చేసే వెతుకులాటలో గమనింపు సహకరిస్తుంది. ఇదంతా ధ్యానమే! అందువల్లే ‘ధ్యాన సాధనలో గమనించడమే ప్రధానం’ అంటారు తత్వవేత్తలు!
మనిషి ఏ పనిచేసినా, చివరలో ఒక ఫలితం కచ్చితంగా వస్తుంది. అది ప్రకృతి సూత్రం! ఒక అంకురం మట్టిలో నాటితే అది పెరిగి పెద్దదవుతుంది. పువ్వులు, ఫలాలు ఇస్తుంది. కనీసం రెండు ఆకులైనా ఇస్తుంది. ఏదీ ఇవ్వలేదంటే అసలక్కడ మొక్కే నాటలేదు, లేదా నాటిన మొక్కను బాగా చూసుకోలేదని నిర్ధారించుకోవచ్చు.
ధ్యానసాధనలో సాధకుడు కరుణామూర్తిగా మారాలి. ప్రేమికుడై పోవాలి. ఆనందపరవశుడు కావాలి. కొత్తగా నాటిన మొక్కకు పువ్వు పూసినట్లుగా, ధ్యానం చేసేవారికి ఒకరోజు ప్రేమ వికసించాలి. అలా జరగకపోతే ధ్యానంలో ఏదో లోపం ఉందని భావించాలి. గమనింపు- రెప్పలేని ‘కన్ను’ లాంటిది. మనసు- ఆ కంటికి ‘రెప్ప’వంటిది. రెప్ప తెరిస్తేనే చూడటం ఆరంభమవుతుంది. అప్పుడు ‘ఆనందం’ మనిషి సొంతమవుతుంది.
- మునిమడుగుల రాజారావు
Sunday, June 26, 2016
జ్ఞానంజ్ఞానం
జ్ఞానంజ్ఞానం
ఈనాడు అంతర్యామి గురువారం, జూన్ 23, 2016
మనిషి జ్ఞానిగా పుట్టడు. అజ్ఞానపు చీకటిని గురువు తొలగించాకనే అతడిలో జ్ఞానదీపిక వెలుగుతుంది. సమర్థుడైన గురువు లభించినా అజ్ఞానం ఉన్నపళంగా తొలగిపోయేది కాదు. గురుబోధను నిష్ఠగా స్వీకరించిన శిష్యుడిలోనూ లేశమాత్రమైనా అజ్ఞానం మిగిలే ఉంటుందంటారు విమర్శకులు. పాఠ్యాంశాలను సదా మననం చేయకపోతే అజ్ఞానపు పొర మరల మరల ఆవరిస్తుంది.ఒక కొలనులో పాచి పేరుకుపోయినప్పుడు రాయి విసిరామనుకోండి, కొంతమేర పాచి తొలగి స్వచ్ఛమైన నీరు కనిపించినా ఆ స్థితి స్థిరంగా ఉండదు. క్రమంగా నీటిని పాచి కమ్మేస్తుంది. అలాగే, స్వీయ అనుభవాల నేపథ్యంలో అజ్ఞానం ఆవరించకుండా సాధకులు తగు జాగ్రత్త వహించాలనేవారు రామకృష్ణ పరమహంస.
వేద వాంగ్మయాన్ని కంఠస్థం చేసి విద్యార్థి జ్ఞానామృతాన్ని పదిలపరచుకుంటాడు. ఆధ్యాత్మిక పరిభాషలో భగవత్తత్వాన్ని సమగ్రంగా తెలుసుకోవడం జ్ఞానమంటారు. ఒకసారి గ్రీకు తత్వవేత్త సోక్రటీసును అశరీరవాణి ‘మహాజ్ఞాన్’ అని సంబోధించింది. అందుకాయన పొంగిపోలేదు. కొందరు వేదాంతులు ఆయన్ను కలిసినప్పుడు సోక్రటీసు మహాశయుడు వినయంగా వారితో అన్నాడు. ‘నేను తెలుసుకున్నదేమైనా ఉంటే అది నాకు ఏమీ తెలియదనే సత్యాన్నే... అందరూ నన్ను మహాజ్ఞాని అంటారు. భగవంతుణ్ని తెలుసుకునే విషయంలో నేనూ అజ్ఞానినే!’
మనిషి విషయ పరిజ్ఞానాన్ని కూలంకషంగా అర్థం చేసుకోలేడు. దిగంతాల వద్ద భూమ్యాకాశాలు కలిసినట్లుగా కనిపించినా, యథార్థం వేరు! భూమ్యాకాశాలు రైలు పట్టాల్లాగా ఎన్నటికీ కలిసేవి కావు. అలా చూస్తున్న మానవ దృష్టి భ్రమతో కూడుకున్నది. పరిశోధనతో శాస్త్రవేత్తలు సత్యాన్ని వెలికి తీస్తుంటారు. వారి శోధన భౌతిక వస్తుజాలానికి పరిమితమవుతుంది. ‘ఆత్మవిచారణతో అద్వైత సత్యాన్ని ఆవిష్కరించుకున్న జ్ఞానికి చెప్పుకోదగ్గ కోరికలేవీ ఉండవు. అలా ఉండే పక్షంలో అతడికి, ఓ జంతువుకు తేడా ఏముంటుంది?’ అని ప్రశిస్తారు ఆధ్యాత్మిక తత్వవేత్త సదానంద యోగి.
జ్ఞాని తనలో ఉన్న ఆత్మతత్వాన్ని అందరిలోనూ సమంగా దర్శిస్తాడు. అందరి కష్టసుఖాలూ తనవిగా భావిస్తాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ప్రముఖ బెంగాలీ సాహితీవేత్త. మానవతావాది. లేగదూడలకు కడుపు నిండా పాలు అందవనే భావంతో పాలు తాగే వారు కాదట! కష్టం కలుగుతుందనే భావనతో ఎద్దులు, గుర్రాలు పూన్చిన వాహనాలు ఎక్కేవారు కాదట!
ఒక సాధువు పౌర్ణమి రాత్రివేళ నయన మనోహరంగా ఆకాశంలో ధవళ కాంతులీనుతూ వెన్నెల కురిపిస్తున్న నిండు చందమామను చూశాడు. అపరిమితానందం పొందుతూ ఇలా అనుకున్నాడు. ‘ఆహా! పండువెన్నెలను ఈ రోజు మాత్రమే చక్కగా ఆస్వాదించగలుగుతున్నాను. మనిషి తనలో ఉండే ఆత్మను గుర్తించలేక ఆనందానికి దూరమవుతున్నాడు. మబ్బు చందమామకు అడ్డు వచ్చినప్పుడు చీకట్లు కమ్ముకున్నట్లు బుద్ధి, ఆత్మల మధ్యకు అజ్ఞానం వచ్చినప్పుడు ఆత్మ ఉనికి గ్రహించలేకున్నాడు. జ్ఞానానికి దూరమవుతున్నాడు!’
సాధనలక్ష్యం అజ్ఞాన నిర్మూలనమే. అయితే అందుకు సజ్జన సాంగత్యం, గురుశుశ్రూష, దైవకృప తోడ్పడతాయంటారు పండితులు. వేలాదిగా దివ్య పురుషుల ఆవిర్భావం వల్ల భరతభూమి కర్మభూమిగా పునీతమైంది. పాశ్చాత్య సాధకులను సైతం భారతదేశం ఆకర్షించి ఆత్మవెలుగు నింపుతోందంటే, అది సనాతన ధర్మ ఔన్నత్యమే!
- గోపాలుని రఘుపతిరావు
దేవాలయం (temple)
సత్య, జ్ఞాన, ఆనందాత్మకమైన తత్వాన్ని స్థూలంగా ‘దేవ’ అనే పదంతో వ్యవహరిస్తున్నాం. దేవనామ రూపకల్పన ‘శబ్ద బ్రహ్మం’లాగా నిత్య సత్యమైన విషయం. సర్వాంతర్యామి అయిన ఒకే ఒక పద చైతన్యం ఉంది. దాన్ని మానవుడు ఎక్కడ కోరుకుంటే అక్కడ సాక్షాత్కరించుకోవచ్చు. అది వైదిక రుషుల దివ్య సందర్శన నాదం.
దేవతామూర్తిలో భక్తుడు దివ్య చైతన్యాన్నే దర్శించుకుంటాడుగాని జడమైన పాషాణాన్ని కాదు. మనకు అగోచరమైనవాటి భౌతిక ప్రతిరూపాలే దేవాలయాలు. మనిషి ఏది చూస్తాడో, ఏది తనకు అనుభవంలోకి వస్తుందో అది మాత్రమే సత్యమనుకొంటాడు. చాలామంది తాము బతికి ఉన్నంతకాలం జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుంటున్నారు. వాటితో అనుభవించినవి తప్ప, మరేవీ వారికి వాస్తవం కావు. భౌతికమైనవాటినే అవి గ్రహించగలవు. మన గ్రహణశక్తి అయిదు ఇంద్రియాలకే పరిమితం కావడం వల్ల జీవితంలో మనకు తెలిసేవన్నీ భౌతికమైనవే. మన దేహాలు, మనసులు, ఆవేశాలు, జీవన శక్తులు- అన్నీ భౌతికాలే!
సునిశితంగా పరిశీలిస్తే, దీనిపై విశాలమైన శూన్యం గోచరిస్తుంది. అక్కడా మనం భౌతికరూపాన్నే గుర్తిస్తున్నాం. రాత్రివేళల్లో నక్షత్రాల్ని, చంద్రుణ్ని, పగటిపూట సూర్యుణ్ని భౌతిక పదార్థాలుగా చూస్తున్నాం.
దేవాలయమైనా, మసీదైనా, చర్చి అయినా, వేరొక ఆరాధనా స్థలమైనా భౌతిక విషయాలకు అతీతమైన ప్రపంచంతో మనిషిని అనుసంధానిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రాపంచిక మానవుణ్ని భగవంతుడితో అనుసంధానించి, జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. అంతేకాదు- నిత్యం చిత్తశుద్ధితో చేసే ప్రార్థనలు మనిషిని ఉన్నతుణ్ని చేసి దివ్యానుభూతులు పొందేలా చేస్తాయి.
ఒక భక్తుడు విశ్వాసం నిండిన హృదయంతో ప్రార్థనా మందిరాన్ని దర్శిస్తే అతడు మానసిక ప్రశాంతత అనుభవిస్తాడు. దైవాన్ని దర్శించడం, సాధుపుంగవుల మంచి మాటలు వినడం, ప్రార్థన చేయడం వల్ల శాంతి చేకూరుతుంది. ప్రతి మతం తనదైన సంప్రదాయ విధానంలో ఆలయాలను, ప్రార్థనా మందిరాలను నిర్మించుకొంటుంది. అవి పూజలకు స్ఫూర్తికేంద్రాలు.
సమాజాన్ని దృఢతరం చేసి, మనుషులందరిలోనూ పరస్పర విశ్వాసం, విశ్వసనీయత రూపొం దించేవి ఆలయాలు. పాఠశాలలు విద్యను బోధిస్తాయి. మరి ఆత్మను జ్ఞానవంతం చేసేదెవరు? వైద్యశాలలు విరిగిన ఎముకల్ని అతకగలవు గాని, చెదిరిన ఆశలను ఉజ్జీవింపజేయలేవు. చలన చిత్రాలు, ఇతర వినోదాలు ఇంద్రియాలను ఉద్రేకపరచగలవు. మనశ్శాంతి కోసం ఎక్కడికి వెళ్లాలి?
దేవాలయాలు ఆత్మను పరిశుద్ధం చేసి, వ్యాధిపూరితం కాకుండా కాపాడతాయి. కొన్ని వ్యాధులు కనిపించవు. అవి అనుభవం వల్లనే తెలుస్తాయి. మన ధర్మశాస్త్రాలు ఆ రోగాలకు చికిత్సశాలలుగా దేవాలయాలనే చెబుతున్నాయి. పాఠశాలలు, వైద్యశాలలు ఎంత అవసరమో దేవాలయాలు కూడా అంతే అవసరం. మనిషికి దేహం, ఆత్మ రెండూ ఉన్నాయి. దేన్నీ అలక్ష్యం చెయ్యకూడదు.
ఆరాధనా స్థలాలు భగవంతుడి పట్ల మానవుడి వివేకవంతమైన భావనకు ప్రతిరూపాలు.
ఏ మతంవారిదైనా ఆ ప్రార్థనా మందిరంలోకి ఆ భక్తులు ధ్యానం కోసం ప్రవేశించినప్పుడు- వారిలో ఒక దివ్యచేతన జ్ఞానం, ఏకీకృత భావం చోటుచేసుకుంటాయి. దేవాలయంలో అనుసంధానం ద్వారా మనం ఉన్నత పథంలో విహరించగలుగుతాం. మనల్ని మనం నియంత్రించుకోవడానికి తగిన శక్తిని పొందగలుగుతాం.
ఒకప్పుడు దేవాలయాలు విద్యాసాంస్కృతిక కేంద్రాలుగా, జ్ఞాన మందిరాలుగా విలసిల్లాయి. ప్రతి వ్యక్తికీ భుక్తినిచ్చి బతికిస్తూనే, ముక్తిమార్గాన ముందుకు నడిపించగల ఆరాధన, సాధన మార్గాలు అవి. ఎన్నెన్నో వృత్తులు, ప్రవృత్తులు దేవాలయాల వల్ల ప్రారంభ వికాసాలను పొందాయి. ఆలయాలే అన్ని వర్గాలనూ నైతిక మార్గంలో ముందుకు నడిపించాయి. ఏ జాతికైనా దేవాలయాలే సమైక్యతా కేంద్రాలు!
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Subscribe to:
Posts (Atom)