జ్ఞాన క్షేత్రం
‘జ్ఞానం ఎందుకు’ అనే ప్రశ్న అర్థం లేనిది. జ్ఞానమనేది ఓ దాహం, ఆర్తి. తీర్చుకుంటున్నకొద్దీ, అది ఇంకా పుడుతూనే ఉంటుంది. ఆ తపనను ఎవరూ ఆపలేరు.
మనిషి జ్ఞానంకోసం పుడతాడు. దాన్ని సంపాదిస్తాడు. ఆ జ్ఞానసాధనలోనే అతడి జీవితం నడుస్తుంది.
పుష్పాలు పరిమళాన్ని ఇస్తాయి. గాలి- ప్రాణంగా మారి మనిషిని నిలబెడుతుంది. ఆకాశం తన విశాలత్వాన్ని చాటుతుంటుంది. సమస్త ప్రకృతీ మనిషికి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే జ్ఞానం వేదమై, వెలుగై లోకంలో ప్రకాశిస్తుంటుంది.
శివుడు ఓ సందర్భంలో జ్ఞానగంగను కోరాడని పురాణాలు చెబుతాయి. అలాగే శ్రీరాముడు తన గురువు వసిష్ఠుడి వద్ద జ్ఞానం పొందాడు.
మనిషి అన్నం మరచిపోవచ్చు కానీ, జ్ఞానాన్ని మరవలేడు. మరవకూడదు. ఏది జ్ఞానం, అది ఎంతవరకు లభ్యమవుతుంది, దాని వల్ల ప్రయోజనం ఏమిటి అని అతడి మనసు ఆలోచిస్తూ ఉంటుంది. తలుపులు తెరిస్తే, అసలైన జ్ఞానం దానికదే వచ్చి అతడి హృదయంలోకి చేరుతుంది. అదే శరీరానికి, మనసుకు, ఆత్మకు పుష్టినిస్తుంది.
పుస్తకాలతో లభించేది గొప్ప జ్ఞానం. ప్రకృతి నేర్పించేది- సహజమైన జ్ఞానం. జీవితం వల్ల కలిగేది, మనిషికి అన్నింటికంటే ముఖ్యమైనది అనుభూతిపరమైన జ్ఞానం. అది సూటిగా సరళంగా అతడి హృదయాన్ని తాకుతుంది. క్షణంలో ఎంతో మార్పుతెస్తుంది.
లోపలి జ్ఞానం వల్ల, మనసే మారిపోతుంది. మనిషి ఎదుట కొత్త దారులు తెరుచుకుంటాయి. యోగ రహస్యాలు తెలుస్తాయి. అతడిలో అప్పటివరకు నిక్షిప్తమై, అతడికే తెలియకుండా ఉన్న దివ్యత్వం అప్పుడు విప్పారుతుంది. నలువైపులా గుబాళిస్తుంది. ఆ బతుకు నందనవనంగా రూపొందుతుంది. జ్ఞానం కలగడం వల్ల, అప్పటిదాకా మృగంలా ఉన్న మనిషైనా నరుడవుతాడు. ఆ నరుడే నరోత్తముడిగా మారతాడు. నరోత్తముడు నారాయణుడిగా వెలుగుతాడు. అదంతా జ్ఞానఫలితమేనని స్వామి వివేకానంద అనేకమార్లు విశదీకరించారు.
పూర్ణజ్ఞానం పొందినవారు విలక్షణంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా రూపొందుతారు. జీవితం నుంచి ఏం పొందాలో కచ్చితంగా తెలుసుకుంటారు. వారు దార్శనికులు. లోకాన్ని దివ్యపథం వైపు నడిపించేది వారే. ఆ కృషిలో రాజ్యపూజ్యం లభించినా, ఒక్కోసారి అవమానం ఎదురైనా వారు చలించరు. ఆ రెండింటినీ సమంగా పరిగణించే స్థితప్రజ్ఞులు వారు!
ఇంత తిని, ఎంతో కొంత పనిచేసి, నిద్రించడమే జీవితగమ్యం అనుకునే స్థితి నుంచి మనిషిని వేరుచేసేది- జ్ఞానమే. సాధారణ ప్రాణికి, దివ్యమైన యోగికి ఉండే తేడాలు రెండు. ఒకటి జ్ఞానం, రెండోది బుద్ధి. వీటిని విస్మరించిననాడు మానవుడికి మనుగడే ఉండదు.
విశ్వం విస్తరిస్తోంది. అంతటా ప్రగతి కనిపిస్తోంది. అంతరిక్షమూ అనేక అవకాశాలు చూపిస్తోంది. అలాగే సరైన జ్ఞానం సంపాదించుకున్న నరుడే అందరికీ అన్నింటినీ సమకూర్చగలడు. ఆ మరో ప్రపంచం కోసమే ప్రతి ఒక్కరూ కలలు కనాలి. వాటికి మూలాధారం- జ్ఞానం. పూర్వం రుషులకు అటువంటి జ్ఞాన సంపదే ఉండేదని ఇతిహాసాలు చెబుతాయి.
కురుక్షేత్రంలో మొదట అర్జునుణ్ని విషాదం ఆవరించింది. శ్రీకృష్ణుడి ఎదుట చాలాసేపు అతడు అదే విషాదయోగంలో ఉన్నాడు. కురు సోదరులు, బంధుమిత్రులు, గురువులతో యుద్ధం చేయనన్నాడు. ఆ మాటలన్నీ విన్న కృష్ణుడు చివరికి జ్ఞానం అనే బాణం ప్రయోగించాడు. అదే అర్జునుడిలో శక్తిని నింపింది. అప్పుడు అతడు మహావీరుడిలా లేచి నిలుచున్నాడు. ఆ వెంటనే జ్ఞానానికి నమస్కరించాడు. విశ్వరూపమే ఆ జ్ఞానం!
యుద్ధం సాగింది. ‘చేసేది నీవు, చేయించేది నేను’ అంటూ అర్జునుణ్ని ముందుకు నడిపించాడు కృష్ణుడు. యుద్ధంలో గెలిపించాడు. ఎప్పటికైనా జ్ఞానక్షేత్రమే గొప్పదని ఆ కురుక్షేత్రంలో రుజువు చేశాడాయన!
- ఆనందసాయి స్వామి
No comments:
Post a Comment