శాంతి మంత్రం అంతర్యామి మంగళవారం, జూన్ 28, 2016
ప్రతి మనిషీ శాంతిని కోరుకుంటాడు. విడ్డూరంగా ఎన్నోసార్లు అతడే అశాంతికి కారణమవుతుంటాడు. శాంతికి, అశాంతికి నెలవు మనసే! ఏ పూజలూ చెయ్యకపోయినా మనసును స్వచ్ఛంగా ఉంచుకుంటే చాలు. ప్రశాంతత మనలో నెలకొంటుంది. ఎవరికీ కీడు కోరకపోవడమే స్వచ్ఛత. అందరి మేలూ కోరడమే పవిత్రత.
మొదట మనం స్వచ్ఛత కోసం కృషిచెయ్యాలి. ఆ తరవాత వచ్చే రెండో అంచె చాలామంది విషయంలో క్లిష్టతరమైంది. సాధారణంగా మన కంటే ఎవరూ అధికులుగా ఉండరాదన్న బలమైన భావనే అశాంతికి బీజాలు వేస్తుంది.
కొంతమంది పైకి నవ్వుతూనే మాట్లాడతారు. లోపల అసూయ తొలిచేస్తుంటుంది. ప్రపంచ రంగస్థలం మీద మనకు ఎందరో నటులు తారసపడతారు. వారి మనసులో కాలుష్యం పేరుకుపోతూ ఉంటుంది. మనోకాలుష్యం శాంతిని, ఆరోగ్యాన్ని హరించి వేస్తుంటుంది. భారతీయ ఆధ్యాత్మికత గొప్పదనం ఏమిటంటే- ఏ రోజుకారోజు మనోమాలిన్యాలను తొలగించుకోగలిగే అనేక ప్రక్రియలను అది అందించింది. ఎవరి స్థాయికి తగినట్లు వారికి ఈ ప్రక్రియలు ఉపకరిస్తాయి. త్రికాల సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, దైవ ఆరాధన, దేవాలయ దర్శనం, ఆధ్యాత్మిక గ్రంథ పఠనం, వేదాంత చర్చలు, ధ్యానం... దేని ప్రాధాన్యం దానిదే!
ధర్మం అంటే మతం అనే అపార్థం మదిలో నాటుకుపోయాక, మానవ సమాజం స్వార్థంగా సంకుచితంగా ఆలోచించడం మొదలైంది. మనిషితనానికి కాక మతవ్యాప్తికి ప్రాధాన్యమిస్తున్నారు. మానవత్వ ప్రాముఖ్యాన్ని మరచిపోతున్నారు.
దేవుడికి ఎవరి నిర్వచనాలు వారు చెబుతున్నారు కాని, ఆయన ఏ మతానికీ బద్ధుడు కాడు. మతంగా వ్యవహరించేది కేవలం ఒక మార్గం. అన్ని దారులూ దేవుడి దగ్గరకే అయినప్పుడు, ఎక్కువ తక్కువ అనేవి అర్థరహితాలు.
‘సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్ఛతి’. కేశవుడు, యెహోవా, అల్లా- పేర్ల మార్పే తప్ప అన్ని ఆరాధనల్నీ స్వీకరించేవాడు ఒక్కడే. కబీరు, గురునానక్ వంటి మహనీయులు పదేపదే ఈ సత్యాన్ని బోధించారు. కానీ, అవి చెవులు దాటి మనిషి మనసులో స్థిరపడనందువల్లే మత సంఘర్షణలు తలెత్తుతున్నాయి. ఆ ఘర్షణలు మారణహోమాలకు కారణంగా మారుతుంటే- కరుణామయుడు, సర్వ ప్రాణపిత, సర్వేశ్వరుడు ఆమోదిస్తాడా?
మానవత్వం లేనిది మతం కానే కాదు. కసాయిలు, హంతకులు దైవకృపకు పాత్రులు కాలేరు. వారి పూజలు, ప్రార్థనలు, ఆరాధనలను భగవంతుడు స్వీకరించడు.
మన పూజలన్నీ కోరికల జాబితాలే. మన మనసులన్నీ ఆశల శిఖరాలే.
ఇవి రెండూ- మనకు, భగవంతుడికి మధ్య అడ్డుగోడలవుతున్నాయి. అందువల్ల, దైవానుగ్రహం ఎందరికో అందని ద్రాక్షగా మిగిలిపోతోంది.
సనాతన ధర్మంలో ఎలాంటి దైవకార్యం చేసినా, శాంతి మంత్రాలతో ముగిస్తారు. ఇది అనాది నుంచి ఉన్న విధానం. అందుకు ఒక కారణం ఉంది.
ప్రకృతిలోని ఓషధులు (వనస్పతులు), పంచభూతాలు, గిరులు, సిరులు పండించే నదులు- నిత్యమూ అనేక కాలుష్యాల బారిన పడుతుంటాయి.
మంత్రాలు భావమయ ప్రకంపనలు. ఆచరణకు ప్రేరణలు. ఆకాంక్షలూ అంతే. ‘లోకాస్సమస్తా సుఖినోభవంతు’, ‘సర్వేజనా స్సుఖినో భవంతు’- వీటిని పెదవుల నుంచి గాక ఆత్మసాక్షిగా మనస్ఫూర్తిగా పలికితే, ప్రకృతి శక్తులు పరిశుద్ధమై ప్రసన్నమవుతాయన్నది పెద్దల మాట. ఈ భావన ఆచరణ రూపం దాల్చిన నాడు అందరూ ప్రకృతికి మిత్రులే, శాంతి దూతలే.
‘అందరూ బాగుండాలి’ అని నిజాయతీగా కోరుకునే వ్యక్తి ఎవరికీ అపకారం చెయ్యలేడు. చేతనైనంత మేరకు ఉపకారమే చేస్తాడు.
‘మన ఏవ మంత్రమ్’ గనుక పదేపదే ఇలా అనుకుని ఆచరిస్తే- అదే, శాంతి మంత్రం!
- కాటూరు రవీంద్ర త్రివిక్రమ్

No comments:
Post a Comment