83 దుఆ (ప్రార్థన)
మనిషి ప్రకృతిని ఆసరాగా చేసుకొంటాడు. భౌతిక అవసరాలు తీర్చుకుంటూ పెరిగేందుకు, బలంగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తాడు. నిజానికి, జీవన ఒడుదొడుకులు తట్టుకొనేందుకు, మనోవైకల్యాలు అధిగమించి సంపూర్ణ పరమార్థాన్ని సాధించేందుకు- ప్రతి నిమిషమూ ఆ సృష్టికర్తను ఆరాధించాలి. దుఆ చేస్తూ తనను తాను జ్ఞానిగా మలచుకోవాలి. ‘పరిపూర్ణ విశ్వాసంతో, నమ్మకంతో దుఆ చేయండి. ఏమరుపాటుకు లోనై పరధ్యానంలో ఉంటూ చేసేవారి దుఆను అల్లాహ్ ఆమోదించడని తెలుసుకోండి. వినయ వినమ్రతలతో అమితమైన అణకువతో అల్లాహ్‌ను వేడుకోండి విలపిస్తూనూ...గోప్యంగానూ...’(ఖురాన్ 7:55)

ప్రార్థించే వ్యక్తి- పరిశుద్ధత పాటించాలి. కాబా గృహానికి అభిముఖంగా మోకాళ్ల వరకు ముడుచుకొని కూర్చొని, చేతులు భుజాల వరకు పైకెత్తాలి. ముందుగా తనకోసం, తరవాత తల్లిదండ్రుల కోసం, సోదరీ సోదరుల కోసం, యావత్తు సమాజం కోసం దుఆ చేయాలి. రాత్రి చివరి జాములో దైవకారుణ్యం మానవులపై ఉంటుంది. ప్రార్థించేందుకు అది చాలా మంచి సమయం. శుక్రవారం ఏ ఘడియలోనైనా దుఆ చేయవచ్చు. రమజాన్ మాసంలోని ఘనమైన రేయి లైలతుల్ ఖద్ర్‌లో చేసే దుఆ, ఖురాన్ పారాయణం తరవాత చేసే దుఆ, వర్షం కురిసేటప్పుడు చేసే దుఆలు సమ్మతమేనని దివ్య ఖురాన్ గ్రంథం తెలుపుతోంది.
తమ సంతానం కోసం తల్లిదండ్రులు చేసే దుఆ; బాధితులు, ప్రయాణికులు, విధేయులైన సంతానం చేసే దుఆ; ప్రజల కోసం న్యాయపరిపాలన చేసే రాజు దుఆ ఆమోదనీయమైనవి. అక్రమార్జనపరులు పవిత్ర మక్కాలోని కాబా గృహం వద్దకు చేరి ప్రార్థించినా అది అంగీకార యోగ్యం కాదు. నమ్మక ద్రోహిని, నిత్య పాపిని అల్లాహ్ ప్రేమించడు.
‘అల్లాహ్! దిగులు, దుఃఖం, బలహీనత, సోమరితనం, పిరికితనం, పిసినారితనం, రుణభారం, ఇతరులపై ఆధిక్యతా ప్రయత్నం నుంచి నేను నీ శరణు వేడుతున్నాను. నీవు నాకు చేసిన ఉపకారాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను నీ దాసుడిని’ అని చేసే దుఆతో మానవుడి మనోవికారాలు అంతమొంది, సన్మార్గపు ద్వారాలు తెరుచుకుంటాయి.
‘ప్రభూ! నాకు దైవభీతిని, సచ్ఛీలతను, నిరాపేక్ష భావాన్ని ప్రసాదించాలని నిన్ను అర్థిస్తున్నాను. మా లెక్కలు తీసుకొనే రోజున- నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులందరినీ క్షమించు. పొరపాటున జరిగే మా తప్పులను ఎంచకు. మమ్మల్ని రక్షించు, కరుణించు. నీవు కనికరించేవాడివి. కరుణామయుడివి. నీ కృప వల్ల మేము జీవించి ఉన్నాం. నీ ఆదేశం మేరకు మరణిస్తాం. మేము నీ వైపే తిరిగిరావాల్సిన వాళ్లం’ అంటూ నిత్యం అల్లాహ్ ముందు ప్రార్థించినవారు రక్షణ పొందుతారు. అల్లాహ్ ప్రసాదిస్తే తప్ప శక్తి సామర్థ్యాలు మానవులకెక్కడివి? సర్వమూ ఎరిగినవాడు ఆ జగద్రక్షకుడు!
రమదాన్ మాసం విశ్వాసికి శిక్షణ వ్యవధి వంటిది. రానున్న పదకొండు నెలల్లో పైశాచికమైన షైతాన్ దుష్టప్రేరణలతో తలపడటానికి, ఇది శక్తిని సమీకరించుకొనే కాలం. విశ్వాసులు రమజాన్ చివరి పది రోజులు, రాత్రులు జాగరణ చేసి అధికోత్సాహంతో దైవారాధనలో నిమగ్నమవుతారు. ఇహ పర లోకాల్లో వరాలు కోరుతూ చేసే దుఆలతో మనుషుల మస్తిష్కం నుంచి పశుప్రవృత్తి, గర్వం, అహంకార భావాలు దూరమవుతాయి. ‘దుఆ విషయంలో విరక్తి చెందకండి. ఏమరుపాటుకు లోను కాకండి. దుఆ చేసేవాడు ఎన్నటికీ నాశనం కాడు’ అని ప్రియమైన ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) ప్రబోధించారు.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మన అత్యంత శ్రేష్ఠమైన రమదాన్ ఆరాధనలను, దుఆలను అంగీకరించి విశ్వశాంతి కలిగించుగాక. ఆమీన్.
- షేక్ బషీరున్నీసా బేగం
No comments:
Post a Comment