Wednesday, June 29, 2016

ఎక్కువ తక్కువలు

అంతర్యామి 
 ఎక్కువ తక్కువలు 

లోకంలో కొందర్ని అల్పులుగా, మరికొందర్ని అధికులుగా భావించడం తగదు. అల్పత్వం, ఆధిక్యం అనేవి ఏదో ఒక వర్గానికి లేదా ధనానికి సంబంధించినవి కావు. అది గ్రహించకుండా- మనిషి పుట్టుక, సిరిసంపదలు, విద్యార్హతలు, చేసే వృత్తిఉద్యోగాల్ని బట్టి ఆధిక్యాన్ని ఆపాదించడం సరికాదు.
ఏ వృత్తీ అల్పమైనది కాదు. కొన్ని వృత్తుల్ని పవిత్రమైనవిగా, మరికొన్నింటిని అందుకు విరుద్ధంగా భావించడం పొరపాటు. చిత్తశుద్ధి కనబరుస్తూ, స్వార్థరహితంగా వ్యవహరిస్తూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడే ప్రతివాడూ ఉత్తముడే!
పరిపాలనకు సంబంధించి, దిగువస్థాయి ఉద్యోగులు మరింత కీలకమైనవారు. వారి పనితీరుపై ఆధారపడి ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. విజేతలుగా పేరు గడించిన రాజులు సైతం, యుద్ధంలో ‘విజయమో వీరస్వర్గమో’ అంటూ పోరాటం సాగించిన సాధారణ సైనికుల వల్లనే చరిత్రకెక్కారు.
భారీయంత్రానికి సైతం కీలకమైన చోట్ల చిన్నపాటి మరలు అవసరమవుతాయి. పొలంలో అహర్నిశలూ శ్రమించి పండించే సన్నకారు రైతు, చెప్పులు కుట్టే వ్యక్తి, పారిశుద్ధ్య కార్మికుడు, భవన నిర్మాణపనిలో రాళ్లెత్తే కష్టజీవి- వీరిలో ఎవరూ తక్కువవారు కారు. కర్మాగారంలో చెమట చిందించే శ్రామికుడు, దుస్తులు నేసే వ్యక్తి- ఎవరినీ చిన్నచూపు చూడకూడదు. పెద్దపెద్ద చదువులు చదవకపోవచ్చు కానీ, వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో ప్రతి ఒక్కటీ సమాజానికి అత్యవసరమైనదే. ఆయా పనుల్ని వారు ఎంత బాగా, నేర్పుగా చేస్తున్నారన్నదే ముఖ్యం.
అల్ప వస్తువులు, అల్ప మానవులు అని ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు. అలా హీనంగా చూడటం విజ్ఞుల లక్షణం కానే కాదు.
ఎవరికైనా బుద్ధిబలమే ముఖ్యం. ఆ బలంతో ఎంతటి పనినైనా సులువుగా సాధించవచ్చు. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ’ అన్నారు నీతిశతక కర్త. మదపుటేనుగును గడ్డిపరకలు కలిసి బంధిస్తాయనడంలోనూ ఉమ్మడిశక్తి ప్రాధాన్యం స్పష్టమవుతుంది. యుక్తిచాతుర్యంతో ఎంత చిన్న ప్రాణులైనా గెలుపు సాధిస్తాయనేందుకు ‘నీతిచంద్రిక’లోని ‘సింహం-కుందేలు’ ఉదంతమే ఉదాహరణ. ఉపాయంతో అపాయం తప్పుతుందని ఆ కథ నిరూపిస్తుంది.
పరాక్రమవంతుడైన శ్రీరాముడికి వానర సేన సాయం కావాల్సి వచ్చింది. రాళ్లతో వారధి కట్టి సముద్రం దాటి వెళ్లిన ఆ సైన్యమే, రాక్షసుల్ని గడగడలాడించింది.
అల్పంగా కనిపించినా, ఆ శక్తి ఎప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుందో ఎవరికీ తెలియదు. లోకంలో కొందరు తామే పండితులమని, తమకు తెలియనిది ఏదీ ఉండదని మిడిసిపడుతుంటారు. విద్య, విజ్ఞానం ఏ ఒక్కరి గుత్తసొత్తు కాదు. తెలివి ఎవరి హక్కుభుక్తమూ కాదు. ఎంతటివారికైనా తెలియనివి, చేతకానివి కొన్ని ఉంటాయి.
ఒక మహా విద్వాంసుడు పడవలో ఏరు దాటుతున్నాడు. ఆ పడవ నడిపే వ్యక్తిని చూసి, అతడికి ఎటువంటి చదువూ లేదని జాలిపడ్డాడు. అది అహంకారానికి దారితీసిన స్థితిలో, కేవలం తనకే సమస్త శాస్త్రాలూ తెలుసునన్నట్లు మాట్లాడాడు. అంతలో తుపాను వచ్చింది. పడవ మునిగిపోతుందనే భయం ఆ పండితుడికి కలిగింది.
పడవ నడిపేవాడు ‘నాకు ఈత వచ్చు కాబట్టి, ఈ నీళ్లలోకి దూకి ఎలాగో తీరం చేరుకుంటాను. మీకూ ఈత వచ్చు కదా’ అని ఆ పండితుణ్ని అడిగాడు. ఆయన గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు!
భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే. అందుకే ఎవర్నీ హీనంగా చూడకూడదు.
పొలంలోని మట్టిలో ఉండే వానపాములు రైతులకు నేస్తాలు. అలాగే పట్టుపురుగులు, తేనెటీగల వంటి అల్పప్రాణులు, క్రిమికీటకాలు సైతం మానవులకు మేలు చేస్తున్నాయి. మనిషి సుఖసంతోషాలతో మనుగడ సాగించడానికి, చిన్నాపెద్దా తేడా లేకుండా అందరి సహకారమూ అవసరమే. అది తెలుసుకొనేందుకు కనీసం ప్రయత్నించకపోవడం, లోకంలో ఎక్కువ తక్కువ భావాలతో వ్యవహరించడం- సంకుచిత స్వభావాన్ని బయటపెడతాయి. వాటి నుంచి మనిషి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది!
- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

No comments:

Post a Comment